గూండాలకు సర్కారు అండ
● బీజేపీ పక్ష నేత అశోక్
సాక్షి, బళ్లారి: ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే బ్యానర్ గొడవను సృష్టించి, కాల్పులు జరిపారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఆరోపించారు. ఆయన ఆదివారం నగరంలో శ్రీరాములు, గాలి సోదరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘బళ్లారి ఘటనకు కారకులైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?, స్థానిక డీఎస్పీని సస్పెండ్ చేయకుండా, ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటి? దోషులను పక్కన పెట్టి, బీజేపీ వారిపై కేసులు ఎందుకు పెట్టారు. అన్నీ మీరే చేసి కేసులు మావారిపైనే పెడతారా? సీఎం, పీఎంఇంటి ముందు కూడా బ్యానర్ కట్టవచ్చునని, అయితే చట్టప్రకారం అనుమతులు ఉండాలి. అనుమతి లేకుండా బ్యానర్ కట్టడం వల్ల గొడవ జరిగింది. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఖబడ్దార్’ అని హెచ్చరించారు. సిద్దరామయ్య ప్రభుత్వం గూండాలకు కొమ్ము కాస్తోందని అన్నారు. కాంగ్రెస్‌వారి సత్యశోధన కమిటీ నివేదిక వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. కాల్పులు జరిపేందుకు గన్‌మెన్‌ను ఎవరు ఆదేశించారో తేలాలి, గొడవపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


