మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
హొసపేటె: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని విజయనగర జిల్లాధికారి కవిత పేర్కొన్నారు. గురువారం పునీత్ సర్కిల్‌లో మహిళలు, పిల్లల భద్రత కోసం విజయ మహిళా సురక్ష పడె కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, స్వావలంబన సాధించినప్పుడే సమాజం మార్పు చెందుతుందన్నారు. మహిళలు తమ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. అనంతరం మహిళా పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేక్ పాల్గొన్నారు.
వ్యక్తి దారుణ హత్య
హొసపేటె: నగర శివార్లలోని బళ్లారి రోడ్డులో ఉన్న కారిగనూరులో ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన గురువారం జరిగింది. ఒక వర్గం వారు కారిగనూరులో నివాసమంటున్న కాసీం(56)పై సుమారు 20 మందికి పైగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కాసీం మృతి చెందారు. ప్రస్తుతం హత్య చేసిన వ్యక్తి పోస్ట్‌మార్టం కోసం నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ జాహ్నవి ఘటనా స్థలానికి చేరుకొని సమాచారం సేకరిస్తున్నారు.
రోడ్ల మరమ్మతు చేపట్టరూ
రాయచూరు రూరల్: నగరంలోని వివిధ వార్డుల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని దమనిత సేవా సమితి డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ రాయచూరు నగరంలోని గోశాల నుంచి మన్సలాపూర్, బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్, శశిమహల్ నుంచి ఆకాశవాణి, ఆశాపూర్ రోడ్డు నుంచి రాజమాత ఆలయం, అరబ్ మొహల్లా నుంచి యక్లాసపూర్ వరకు అధ్వానంగా మారిన రోడ్లను మరమ్మతు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సువర్ణ, నరసింహులు, శివశంకర్, సుశీల్, పరశురాం, అశోక్, జావిద్‌రాజులున్నారు.
హాస్టల్‌లో సమస్యలు తీర్చాలని ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టిలోని సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. గురువారం హట్టిలోని అంబేడ్కర్ సంక్షేమ శాఖ హాస్టల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ మాట్లాడారు. విద్యార్థులకు మంచి ఆహారం పెట్టడం లేదన్నారు. వార్డెన్ కనీసం ఫోన్ కాల్ కూడా స్వీకరించడం లేదన్నారు. విద్యార్థులను వార్డెన్ బెదిరిస్తున్నారని, మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. విద్యార్థులకు ఆహారం పంపిణీ విషయంలో అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపించారు.
పెట్టుబడి పెడితే అధిక
లాభాలంటూ వంచన
●నిందితుడు అరె్‌స్ట్
రాయచూరు రూరల్: సామాన్య ప్రజలు పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని ప్రజలను నమ్మించిన ఉదంతం జిల్లాలో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన మోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక లాభం వచ్చేలా చూస్తామని బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేయించుకున్నట్లు తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 17 నుంచి 2025 జూన్ 21 వరకు రూ.3.50 లక్షలను గుజరాత్‌లోని సూరత్ జిల్లాకు చెందిన మోహిత్ రాజ్వాని, మదతల్లి రాజ్వాని ఖాతాలకు డబ్బులు వేసిన సింధనూరు టీపీ ఇంజినీర్ మహబూబ్ రెహమాన్ సింధనూరు సైబర్ పోలీస్ సెల్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు.
అవినీతిపై దర్యాప్తు జరపాలి
బళ్లారిఅర్బన్: కార్మిక శాఖలో కట్టడ కార్మికులకు ఇవ్వాల్సిన వివిధ సౌకర్యాలలో ఎన్నో లోటు పాట్లు కనిపిస్తున్నాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.800 కోట్లకు పైగా కార్మికుల ధనం దుర్వినియోగం అయిందని, తక్షణమే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కట్టడ నిర్మాణ, అసంఘటిత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ.దేవరాజ్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే కిట్ల పంపిణీ, స్మార్ట్ కార్డుల నమోదు, పరికరాల కొనుగోలులో మార్కెట్ ధర కన్నా 5 రేట్లు ఎక్కువకు నకిలీ బిల్లులు సృష్టించి శ్రమ జీవుల కార్మికుల ధనాన్ని దోచుకున్నారన్నారు. ఈ అవినీతి కుంభకోణంపై జనవరి 16 తర్వాత బెంగళూరు ఫ్రీడం పార్కులో భారీ ఆందోళన చేస్తామన్నారు. ప్రముఖులు శ్రీనివాస్, శివనాయక్, శంకరప్ప, తిప్పేస్వామితో పాటు ఆయా సంఘాల పదాధికారులు సభ్యులు పాల్గొన్నారు.
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి


