మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత

Dec 19 2025 8:21 AM | Updated on Dec 19 2025 8:21 AM

మానవ

మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత

బళ్లారిటౌన్‌: మహిళలు, పిల్లలను అక్రమంగా రవాణా చేయడాన్ని నియంత్రించడం మన అందరి బాధ్యత అని, దీని కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయాలని మహిళ శిశు సంక్షేమ శాఖ డీడీ రామకృష్ణ నాయక్‌ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, న్యాయసేవల ప్రాధికార శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా పంచాయతీ నజీర్‌ సభాంగణంలో ఏర్పాటు చేసిన మహిళలు, పిల్లల అనైతిక రవాణా నియంత్రణపై సదస్సులో పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మహిళలు, పిల్లల రవాణాతో పెరిగే దుష్పరిణామాలపై అన్ని సంఘ సంస్థలు అవగాహన కల్పించాలన్నారు. వివిధ శాఖల సహభాగత్వంతో నియంత్రించే దిశగా పని చేయాలన్నారు. విద్యాశాఖ డీడీ బీ.రమాదేవి మాట్లాడుతూ పిల్లలకు చదువుపై అవగాహన కల్పించాలన్నారు. 7 రోజుల కన్నా ఎక్కువగా గైర్హాజరైతే ఇలాంటి పిల్లలపై వారి తల్లిదండ్రులతో చర్చించి మళ్లీ పాఠశాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జీత కార్మిక పద్ధతిలో పిల్లలను పని చేయించరాదన్నారు. 6 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. బాల కార్మిక పథకం అధికారి ఏ.మౌనేష్‌, వివిధ శాఖల అధికారులు ఈశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలు తగదు

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేయడం తగదని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. గురువారం పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్‌ పాటిల్‌ మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై వేసిన డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక కేసును కోర్టు రద్దు చేసి నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని కోరారు.

ఏకగ్రీవ ఎన్నిక

రాయచూరు రూరల్‌: కేపీటీసీఎల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ దేశాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కేపీటీసీఎల్‌ ఇంజినీరింగ్‌ విభాగం సంఘానికి జరిగిన ఎన్నికల్లో రాయచూరు జెస్కాం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న దేశాయి ఏకగ్రీవంగా విజయం సాధించారు.

సర్కారు బడులను బలపరచండి

రాయచూరు రూరల్‌ : రాష్ట్రంలో ప్రభుత్వ కన్నడ ప్రాథమిక పాఠశాలలను సంరక్షించి బలపరచాలని ప్రభుత్వాన్ని ఏఐడీఎస్‌ఓ డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఏఐడీఎస్‌ఓ సంచాలకులు చెన్నబసవ మాట్లాడారు. కర్ణాటక పబ్లిక్‌ పాఠశాలలను నెలకొల్పి ప్రాథమిక పాఠశాలలను మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం ఇచ్చారు.

మానసిక వ్యథతో

ఇద్దరు ఆత్మహత్య

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ పెద్దలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక పోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నాలుగేళ్ల నుంచి పోటీ పరీక్షలు నాలుగు సార్లు రాసి విజయం సాధించినా నియామకాలు చేయక పోవడంతో మానసికంగా కుంగిపోయిన ధార్వాడకు చెందిన పల్లవి(25) గురువారం ఆత్మహత్య చేసుకుంది. సిరివార తాలూకా బాగలవాడకు చెందిన దేవరాజ్‌(25)అనే యువకుడు ఉద్యోగం లభించక మానసిక వ్యధతో ఆత్మహత్యకు పూనుకున్నారు. గత ఆరు నెలల్లో ముగ్గురు మరణించారు.

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

బళ్లారిఅర్బన్‌: భీమరావ్‌ ఐఏఎస్‌, కేఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఐఏఎస్‌, కేఏఎస్‌, సీఐ, సీ గ్రూప్‌, పీటీఓ, ఎఫ్‌డీఏ, ఎస్‌బీఏ తదితర వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ చైర్మన్‌ కేఆర్‌ హుసేనప్ప నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం వ్యాప్తంగా ముఖ్యంగా కళ్యాణ కర్ణాటక బీసీ విద్యార్థుల కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి రివార్డులు ఇస్తామన్నారు. ఆ తర్వాత స్థానాలు సాధించిన 10 మంది విజేతలకు రూ.1000 చొప్పున నగదు, అందుకు సమానమైన పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. మెరిట్‌ సాధించిన 50 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ కల్పిస్తామని సంస్థ డైరెక్టర్‌ శేఖరప్ప వివరించారు. ఉచిత నమోదు ఇప్పటికే ప్రారంభం అయిందని, ఈ నెల 26 వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో శేఖరప్ప, శేషప్ప, హనుమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణా  నియంత్రణ అందరి బాధ్యత 1
1/3

మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత

మానవ అక్రమ రవాణా  నియంత్రణ అందరి బాధ్యత 2
2/3

మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత

మానవ అక్రమ రవాణా  నియంత్రణ అందరి బాధ్యత 3
3/3

మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement