శ్మశానస్థలం కోసం శవంతో నిరసన
హుబ్లీ: శ్మశానస్థలం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసన చేపట్టిన ఘటన దావణగెరె జిల్లా హరిహర తాలూకా బన్నికోడు గ్రామంలో చోటు చేసుకుంది. అంత్యక్రియలు నెరవేర్చడానికి శ్మశానం లేకపోవడంతో ఆక్రోశించిన ఆ గ్రామస్తులు మహిళ మృతదేహాన్ని ఆ జీపీ కార్యాలయం ఎదుట పెట్టి నిరసన తెలిపారు. ఈ గ్రామంలో గత కొన్నేళ్ల నుంచి శ్మశానం లేకపోవడం ప్రధాన కారణం కాగా ఎవరు చనిపోయినా గ్రామస్తులకు అంత్యక్రియల కోసం నానా పాట్లు పడక తప్పని పరిస్థితిని ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. మృతురాలు కెంచమ్మ(60) అనారోగ్యంతో చనిపోయారు. ఆమె అంత్యక్రియలకు శ్మశానం లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నిరసన ప్రదర్శన చేపట్టి ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ సమస్యలపై ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు తమ ఉదాసీనతను వీడటం లేదు. అంతేగాక శ్మశానం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమించినా తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికై నా శ్మశానానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్భంగా గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ హుటాహుటిన అక్కడికి వచ్చి ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా స్థానికుల కోపం చల్లారలేదు. దీంతో శ్మశాన స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని అధికారి హామీ ఇచ్చాకే గ్రామస్తులు ఆందోళనను విరమించి మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు తీసుకెళ్లారు.


