క–కలో తెల్ల బంగారం వెలవెల
రాయచూరు రూరల్: తెల్ల బంగారానికి మార్కెట్‌లో ధర లభించక రైతులు తల్లడిల్లి పోతున్నారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.8,500–రూ.9,000 ఉండగా నేడు రూ.6,800 నుంచి రూ.7,100 ధరలు పలుకుతున్నాయి. నూతన పత్తి మార్కెట్‌లో ధరలు ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాల్‌కు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అధికంగా తెలంగాణలోని కృష్ణ, మక్తల్, నారాయణపేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల, ధరూరు, నందిన్ని, బలిగేర, అయిజ, మాధవరం, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు వస్తున్నాయి. ప్రతి నిత్యం హైదరాబాద్– రాయచూరు రహదారిలో పత్తి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్‌లలో రైతులు పత్తిని తీసుకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక(క–క) ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో నదుల్లో నీరున్నా రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లోని కృష్ణా నదిలో నీరందక రైతుల భూముల్లో వేసుకున్న పంటల దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రైతులు జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. భారతీయ పత్తి మండలి అధికారులు ఎక్కడా కొనుగోలు చేస్తున్నట్లు రైతులకు సమాచారం అందడం లేదు. రాజకీయ నేతలు బూటకపు ప్రకటనలతో ప్రచారం చేయడాన్ని రైతులు ఖండిస్తున్నారు.
తగిన ధర లభించక తల్లడిల్లుతున్న రైతులు
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఢమాల్
క–కలో తెల్ల బంగారం వెలవెల


