కేంద్రానివి కక్ష సాధింపు రాజకీయాలు
సాక్షి,బళ్లారి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)లో గాంధీజీ పేరును తొలగించడం సరైన చర్య కాదని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. నగరంలోని మోకా రోడ్డులోని వాజ్‌పేయి లేఅవుట్ పక్కనే సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో గుమికూడి కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహాత్మాగాంధీజీ అంటే బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు గిట్టడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదల కడుపు నింపేందుకు అప్పట్లో నరేగ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీజీ పేరును తొలగించి వీబీజీరామ్‌జీ పేరును పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గాంధీజీ పేరునే తొలగించే సాహసం చేస్తున్న వీరికి జనం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మార్చి మహాత్మాగాంధీజీ పేరును యధాతథంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ నేత శివయోగి, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు, గ్యారంటీ పథకాల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు చిదానందప్ప, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయాజ్ అహ్మద్, జగన్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నరేగ పథకం పేరును మార్చొద్దు
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేగ పథకం పేరును మార్చడం తగదని మహిళా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు నిర్మల మాట్లాడారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
పథకం పేరు మార్పు హేయం
మహాత్మా గాంధీజీ అంటే బీజేపీకి,
ఆర్‌ఎస్‌ఎస్‌కు గిట్టదు
కేంద్రంపై విరుచుకుపడిన
కాంగ్రెస్ నాయకులు
కేంద్రానివి కక్ష సాధింపు రాజకీయాలు


