వణికిస్తున్న చలి పులి
సాక్షి,బళ్లారి: బిసిల బళ్లారి(ఎండల బళ్లారి)లో ఎంతటి ఎండలనైనా ఈ ప్రాంత వాసులు తట్టుకునేందుకు వెనుకాడరు. అదే చలి అయితే వామ్మో.. చలి అంటూ బెదిరిపోతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదరిగి, రాయచూరు, బాగల్‌కోటె, బీదర్ తదితర జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి. అదే చలికాలం వచ్చిందంటే అమాంతంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలికి జనం వణికిపోతున్నారు. గత 15 రోజులుగా చలి ప్రభావంతో ఉదయం 9 గంటలు అయినా జనం బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు రావడం వల్ల జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. చలికాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చలికి తట్టుకోలేక స్వెట్టర్లు, చలిమంటలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
పల్లెల్లో రైతుల బాధలు ఎన్నెన్నో
పల్లెల్లో అయితే రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. రాత్రిళ్లు కరెంటు వదిలినప్పుడు పొలాల్లోకి వెళ్లి పంటలకు నీరు అందించే రైతుల బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. చలికాలం ముగిసే వరకు అయినా పగటిపూట పంట పొలాలకు విద్యుత్ వదిలితే బాగుంటుందని రైతులు పేర్కొంటున్నారు. చలి ప్రభావంతో పాటు మంచు విపరీతంగా కురుస్తోంది. ప్రతి రోజు తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటలకు వరకు పొగమంచు కప్పేయడంతో ముందు వచ్చే వాహనాలు కాని, మనుషులు కాని దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో వాహనాల్లో వెళ్లే వారు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు వదిలే వరకు వాహనాల్లో వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచనలు అందిస్తున్నప్పటికీ గత్యంతరం లేక అవసరం ఉన్నప్పుడు వాహనాల్లో వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు డ్రైవర్లు పేర్కొంటున్నారు.
నగర శివారు కాలనీలో వ్యాపించిన దట్టమైన పొగమంచు
మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని వైనం
రోజురోజుకు తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉదయం 9 గంటల వరకు
కురుస్తున్న పొగమంచు
పొగమంచుతో వాహనాల్లో
వెళ్లేవారికి ఇబ్బందులు
చలికాలంలో ప్రజలకు తప్పని ఆరోగ్య సమస్యలు
మరో నెల పాటు ఇదే వాతావరణం
మరో నెల రోజుల పాటు జనవరి ఆఖరు వరకు ఇదే విధంగా దాదాపు చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నెల రోజులకు పైగా చలికి ఏవిధంగా తట్టుకోవాలో దిక్కుతెలియక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చలి ప్రభావంతో ముఖ్యంగా చిన్న పిల్లలకు వెంటనే పలు అనారోగ్య సమస్యలు వస్తున్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జలబు, దగ్గు నుంచి కొంత మేరకు బయటపడేందుకు వీలవుతుందంటున్నారు. చలికాలంలో ఉదయం వేళల్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లి వాకింగ్ చేయడం సరికాదని కూడా వైద్యులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటక పరిధిలో చలి ప్రభావం బాగా పెరిగిందంటున్నారు. అన్ని విధాలుగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ, ఉదయం వేళల్లో వాహనాల్లో వెళ్లే వారు మంచు వల్ల ప్రమాదాల బారిన పడకుండా వాహనాలను నడపాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
వణికిస్తున్న చలి పులి


