బైక్‌ను ఢీకొన్న బొలెరో
సాక్షి బళ్లారి: బొలెరో అదుపు తప్పి బైక్‌ను ఢీ కొనడంతో ఘటన స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఇది. గురువారం కొప్పళ జిల్లా ఇందరగి సమీపంలోని హొసళ్లి గ్రామానికి చెందిన రాజాహుస్సేన్(17), వాజిద్ (17), గంగావతి తాలూకా శ్రీరామనగర్‌కు చెందిన ఆసీఫ్(18) అనే ముగ్గురు యువకులు శ్రీరామనగర్ నుంచి హొసళ్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సమయంలో ఇందరగి సమీపంలో బొలెరో వాహనం ఢీ కొంది. దీంతో బైక్ నుజ్జు కావడంతో పాటు తీవ్ర గాయాలతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హొసళ్లి, శ్రీరామనగర్ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
48 గంటల్లో తండ్రీకుమారుల మృతి
ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజాహుస్సేన్ తండ్రి బుడేన్‌సాబ్ రెండు రోజుల క్రితం మృతి చెందారు. కొప్పళ తాలూకా హిట్నాల్ టోల్‌గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో రాజాహుస్సేన్ తండ్రి బుడేన్‌సాబ్(45) మృతి చెందగా తండ్రి అంత్యక్రియలు ముగిసిన తర్వాత రోజు గడవక ముందే కుమారుడు రాజాహుస్సేన్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం యాదృచ్ఛికం. మరణంలోను తండ్రీకుమారుల బంధం వీడనిదిగా మారడంతో మృతుల కుటుంబాల్లో మరింత విషాదాన్ని నింపింది. ఈ ఘటన కొప్పళ జిల్లాలో మృతుల బంధువులు, స్నేహితులకు కన్నీటిని మిగిల్చింది. ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు యువకుల దుర్మరణం
కొప్పళ జిల్లాలో ఘోర ప్రమాదం


