విభిన్నం.. రథోత్సవం
నేలపై కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్న పురుషులు
సన్నిధికి హారతులు ఇస్తున్న పురుష భక్తులు
బసాపురలో స్వామివారి సన్నిధి, రథం లాగుతున్న మహిళా భక్తులు
హుబ్లీ: వెన్నదోసె(బెణ్ణెదోసె)లకు పేరుగాంచిన దావణగెరె జిల్లాలో జాతరలు, ధార్మిక కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ జరిగే వివిధ దేవతల జాతరలు రాష్ట్రంలో పేరు మోశాయి. దుర్గాంబికా దేవి జాతర మొదలు హరిహరేశ్వర తేరు, ఉక్కడగాత్రి కరిబసవేశ్వర జాతర సుప్రసిద్ధమైనవి. అయితే దావణగెరె తాలూకా యరగుంటెలో జరిగే మహిళల జాతరకు మరొక విశేషత ఉంది. ఈ జాతరలో పురుషులకు బదులుగా మహిళలే తేరు(రథం)ను లాగుతారు. మరో విశేషం అంటే దావణగెరె శివారులోని బసాపుర గ్రామంలో జరిగే మహేశ్వరుడి జాతరలో మహిళలకు మాత్రమే ప్రవేశ నిర్బంధం ఉంది. ఈ జాతరలో పురుషులే స్వామివారి సమాధిని దర్శించుకుని పునీతులవుతారు. అందుకే దీన్ని పురుషుల ఐక్యత చాటే జాతరగా కూడా పిలుస్తారు. భార్య, పిల్లా, జల్లా, తల్లిదండ్రులు, తోబుట్టువులతో జాతర చేసే ఈ కాలంలో వైవిధ్యంగా పురుషులు మాత్రమే మహేశ్వర స్వామి సన్నిధిని దర్శనం చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించి తమ మొక్కలను సమర్పించి ఊరి బయట బంతి భోజనం చేయడం ద్వారా భక్తి సాగరంలో మునిగి తేలుతారు.
శతాబ్దాల ఘన చరిత్ర సొంతం
ఈ ప్రాచీన ఆచార వ్యవహారాలకు సుమారు 3 శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. మహిళలు అక్కడికి వస్తే చెడు జరుగుతుందన్న విశ్వాసం ఇక్కడ ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. కోరుకున్న కోరికలు, మొక్కుకున్న మొక్కులు తీరుతాయి. పొలాల కొనుగోలు, కష్టసుఖాలు, సాధక, బాధకాల గురించి గట్టి సంకల్పం చేసుకుంటే సమస్యలు ఇట్టే దూరం చేస్తారని పరమభక్తుడు కొట్రయ్య అభిప్రాయపడ్డారు. మొత్తానికి చెన్నగిరి తాలూకా చిక్కొల్లికెరెలో తొలిసారిగా మహేశ్వరుడి జాతరను వైభవంగా ఆచరించారు. ఈ జాతరకు, బసాపుర జాతరకు అవినాభావ సంబంధం ఉంది. బసాపుర నివాసి ఓ యజమాని ఎద్దుల కొనుగోలుకు చిక్కొల్లికెరెకు బయలుదేరి వెళ్లి మహేశ్వర స్వామి జాతరను వీక్షించి మహేశ్వరుడి సన్నిధిని దర్శించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ భక్తిప్రపత్తులతోనే ఆయన బసాపురలో మహేశ్వరుడి ఆరాధనకు శ్రీకారం చుట్టారు. కాలక్రమేణ ఇది బసాపుర గ్రామ జాతరగా మార్పు చెంది వాసికెక్కినట్లు ఆ గ్రామ పెద్దలు చెబుతారు. నేటికీ ప్రతి ఏటా కార్తీకమాసంలో ఈ జాతర జరుగుతుంది.
యరగుంటెలో రథం తాడు పట్టుకొని మహిళా భక్తుల ఆనంద పరవశం
కరిబసవేశ్వరుడు, మహేశ్వర దేవుడి మూల విగ్రహాలు
యరగుంటె జాతర మహిళలకే సొంతం
బసాపుర జాతర పురుషులకే ప్రత్యేకం
ఇది బెణ్ణెదోసె దావణగెరె జిల్లా వైవిధ్యం
నేలపై కూర్చొనే ప్రసాద స్వీకరణ
రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు విచ్చేసే పురుష భక్తులు నేలపై కూర్చొనే ప్రసాదం స్వీకరిస్తారు. క్వింటాళ్ల మేర అన్నం, చారు, మజ్జిగ, అరటి పండు ప్రసాద రూపంలో లభిస్తుంది. ముఖ్యంగా మహేశ్వర స్వామి సన్నిధి సమీపంలో ఆనెకొండ బసవేశ్వర స్వామి, బసాపుర గురుసిద్దేశ్వర స్వామి, అలాగే హాలస్వామి దేవతలు సంగమం అవుతారని నమ్ముతారు. సన్నిధిపై పళ్ల తొక్కలను పెడతారు. ఓ పూజారి పుష్కరిణిలో ఈ అరటి తొక్కలను నిమజ్జనం చేస్తారు. ఈ తొక్కలు పుష్కరణి నీటిలో తేలితే గ్రామానికి శుభం అని, అలాకాకుండా మునిగితే ప్రమాదం తప్పదని స్థానికులు విశ్వసిస్తారు. ఈసారి పుష్కరిణిలో వదిలిన అరటి పండు తొక్కలు నీటిలో కొద్ది సేపు తేలడంతో ప్రజలు ఎంతో ఆనందంతో చిందులు వేశారని గ్రామస్తులు తెలిపారు. బసాపుర నివాసి సిద్దరామేశ్వర మాట్లాడుతూ ఏడాదికి ఒక్కసారి జరిగే జాతర తేరుతెన్నుల గురించి వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచరణ పరంపర కొనసాగుతోందని కరిబసవేశ్వర స్వామి సన్నిధి మఠం పరమేశ్వర స్వామి తెలిపారు.
విభిన్నం.. రథోత్సవం
విభిన్నం.. రథోత్సవం
విభిన్నం.. రథోత్సవం
విభిన్నం.. రథోత్సవం


