గాలిమరలు.. పక్షులకు మరణ శాసనాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆగ్రహార గ్రామ శివార్లకు పక్షులు గుంపులు గుంపులుగా వచ్చేవి. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన గాలిమరల నుంచి వచ్చే భారీ శబ్దానికి కొన్ని పక్షులు వేరే చోటికి తరలి వెళుతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో స్థానిక పక్షులు, దూర దేశాల నుంచి వలస పక్షులు విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని అంకసముద్ర చెరువుకు తరలి వస్తాయి. పక్షులు ఆహారం కోసం కూడ్లిగి తాలూకా వరకు ఎగిరి వస్తాయి. కానీ గాలిమరల ఫ్యాన్‌ల శబ్ధం వాటిని వేరే చోటికి వెళ్లేలా చేస్తోంది. ఇది పక్షుల ఉనికికి ముప్పు కల్గిస్తోంది. కూడ్లికి తాలూకాలోని అగ్రహార సరస్సు, అంకసముద్ర చెరువు వేలాది పక్షులకు స్వర్గధామంగా ఉండేది. కాని ప్రస్తుతం పొలాల్లో గాలిమరల ఏర్పాటు వల్ల దేశ, విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షుల వలస తగ్గుముఖం పట్టింది. కూడ్లిగి తాలూకాలోని హొసహళ్లి, గుడేకోటె ఫిర్కాల్లో గాలిమరల ఫ్యాన్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని వలస పక్షులు ఈ చెరువు నుంచి దూరంగా వేరే చోటకు వెళ్లేందుకు ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుకుతున్నాయి. పక్షి నిపుణులు, పర్యావరణ వేత్తలు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి శక్తిహీనులుగా మారారని పక్షి వీక్షకులు, అభిమానులు తెలిపారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, సంఘ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
గాలిమరలు.. పక్షులకు మరణ శాసనాలు


