డిమాండ్ల సాధన కోసం కరవే ధర్నా
మాలూరు : వివిధ డిమాండ్ల సాధన కోసం కరవే ప్రవీణ్ శెట్టి వర్గం కార్యకర్తలు సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ ఎంవీ రూప ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఉదయం పట్టణంలోని ప్రముఖ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులు కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరవే రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ కోలారు జిల్లాకు అందిస్తున్న కేసీ వ్యాలీ నీటిని మూడు దశల్లో శుద్ధీకరించి అందించాలన్నారు. ఎత్తినహొళె పథకాన్ని త్వరగా పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. కోలారు జిల్లాలో అంతర్జలాల స్థాయిని పెంచే ఉద్దేశంతో కేసీ వ్యాలీ పథకం ద్వారా జిల్లాలోని చెరువులకు అందిస్తున్న నీటిని మూడు దశల్లో శుద్ధీకరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, నిరాసక్తి వల్ల జిల్లాకు ఎలాంటి అనుకూలం కలగడం లేదన్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చొరవ చూపితే కృష్ణా నది నీటిని కోలారు జిల్లాకు తేవచ్చన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలో భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో కరవే ప్రవీణ్‌కుమార్ శెట్టి వర్గం జిల్లా అధ్యక్షుడు రాజేష్, తాలూకా అధ్యక్షుడు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


