హనుమజ్జయంతి వేడుకలు
మైసూరు: మైసూరు నగరంలోని ఇర్విన్ రోడ్డులోని ప్రఖ్యాత శ్రీపంచముఖి ఆంజనేయస్వామివారి ఆలయంలో సోమవారం హనుమజ్జయంతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు విద్వాన్ ఎస్.కృష్ణమూర్తి, బృందం లోక కళ్యాణం కోసం హోమాలు, పూజలు జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బంధువు వంచన..
తల్లయిన బాలిక
తుమకూరు: జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని హులియారు దుర్గలో సుమారు 16 సంవత్సరాల బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు కారణమైన బాలిక బంధువు మల్లేష్ (45)పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి మల్లేష్ తరచూ అత్యాచారానికి పాల్పడేవారు. దీంతో బాలిక గర్భవతైంది. ఆగస్టులో బాలిక అనారోగ్యానికి గురికాగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి ఎవరికీ చెప్పకుండా ఉంచారు. నవంబర్ 18వ తేదీన బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో అందరికీ తెలిసింది. తల్లిదండ్రులు హులియారు దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుని కోసం గాలించి ఇప్పటికి అరెస్టు చేసి జైలుకు తరలించారు.
దత్త జయంతికి పటిష్ట భద్రత
సాక్షి బెంగళూరు: నవంబర్ 26న ప్రారంభమైన చిక్కమగళూరు తాలూకా దత్త గిరులలో దత్త జయంతి, దత్త మాలా అభియాన్ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. మంగళవారం సుమారు 2–3 వేల మంది మహిళలతో నగరంలో శోభాయాత్ర జరగనుంది. దత్త పీఠానికి ర్యాలీగా వెళ్లి అనుసూయ దేవిని పూజించి, జయంతిని నిర్వహించనున్నారు. బుధవారం చిక్కమగళూరు నగరంలో దత్త భక్తులు, వేలాది మంది ప్రజలు భారీ శోభాయాత్రలో పాల్గొంటారు. గురువారం చివరి రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు దత్తపాదుక దర్శనం చేసుకోనున్నారు. అల్లర్లు వంటివి జరగకుండా జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. 500కు పైగా సీసీటీవీ కెమెరాలు, 25కు పైగా డ్రోన్లలను సిద్దం చేశారు. ఎస్పీ విక్రమ్ అమట నేతృత్వంలో సోమవారం చిక్కమగళూరులో కవాతు జరిపారు.
రూ.8 కోట్ల చలానాల వసూలు
శివాజీనగర: ట్రాఫిక్ ఉల్లంఘన చలానాల చెల్లింపులో సగం రాయితీ ఇవ్వడంతో రాష్ట్రంలో మంచి స్పందన వ్యక్తమైంది. గత 10 రోజులలో రూ.8 కోట్లకు పైగా జరిమానాలు వసూలయ్యాయి. 2,82,793 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పరిష్కారమయ్యాయి. డిసెంబర్ 12 వరకు రాయితీ సౌలభ్యం ఉంది. బెంగళూరుతో సహా అన్ని నగరాలు, పట్టణాలలో వాహనదారులు చెల్లింపులు చేశారు.
వరుసగా క్యాబ్‌లు ఢీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు ఆవరణలో క్యాబ్‌లు వరుసగా ఢీకొన్నాయి. సెక్యూరిటీ పాయింట్ వద్ద ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు హడలిపోయారు. ముందు వెళ్తున్న క్యాబ్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న క్యాబ్‌లు దానిని ఢీకొన్నాయి. పలు కార్ల ముందు, వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ హాని కలగలేదు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని నిలిచిపోయిన కార్లను దూరంగా తరలించారు. ఈ సంఘటనతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దత్తపీఠంలో గీతా జయంతి
మైసూరు: భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ప్రతి మాటను అనుసరిస్తూ ముందుకు సాగాలని మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు సూచించారు. సోమవారం గీతా జయంతి వేడుకలను నిర్వహించారు. భగవద్గీత పారాయణం, బంగారు పతకం ప్రదానోత్సవం నిర్వహించారు. మన పూర్వీకులు భగవద్గీతను జీవితంలో భాగంగా చేసుకున్నారని, సంపన్నులు, మహాత్ములు భగవద్గీతను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేవారని చెప్పారు.
హనుమజ్జయంతి వేడుకలు
హనుమజ్జయంతి వేడుకలు


