మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌కు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌కు గ్రహణం

Nov 11 2025 5:51 AM | Updated on Nov 11 2025 5:51 AM

మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌కు గ్రహణం

మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌కు గ్రహణం

హుబ్లీ: హుబ్లీ నగర నడి బొడ్డున మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభమై ఏడేళ్లు గడిచాయి. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మొత్తానికి ఏ క్షణంలో ఈ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టారో కానీ ముగింపు ప్రక్రియ ఎప్పుడో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీంతో సంబంధిత కాంట్రాక్ట్‌ ఒప్పందం రద్దు చేయడానికి హుబ్లీ ధార్వాడ పాలికె నడుం బిగించింది. విపరీతంగా రోజు రోజుకు పెరిగి పోతున్న వాహనాల రద్దీ దృష్ట్యా అత్యాధునిక వాహనాల నిలుపుదలకు అనుకూలం అయ్యే దిశలో ఈ మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా శ్రీకారం చుట్టారు. అయితే ఏడేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అఘోరించింది. స్మార్ట్‌ సిటీ అధికారులు గతంలో సంబంధిత కాంట్రాక్టర్‌కు పనుల నిర్లక్ష్యం, జాప్యం కారణంగా కోట్లాది రూపాయల జరిమానా విధించి ఆ మేరకు పలు నోటీసులు పంపారు.

2020 నాటికే పూర్తి కావాల్సింది.!

హుబ్లీ ధార్వాడ స్మార్ట్‌ సిటీ లిమిటెడ్‌ పబ్లిక్‌, ప్రైవేట్‌ సహ భాగస్వామ్యం కింద రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో సదరు లిమిటెడ్‌ సంస్థ 10 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఈ బహుళ అంతస్తుల కారు పార్కింగ్‌ కాంప్లెక్స్‌ వాస్తవంగా 2020లో పూర్తి కావాల్సింది. అయితే కోవిడ్‌ తదితర కారణాల వల్ల కొన్ని అవకాశాలతో గడువు ఇచ్చారు. హుబ్లీలోని సురేష్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కాంట్రాక్ట్‌ పొందగా నిర్మాణ పనులు అత్యంత నాసిరకంగా కొటొచ్చినట్లుగా కనిపిస్తుంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణం ఓ స్థాయికి వచ్చే వరకు కాంట్రాక్ట్‌ రద్దు చేయడం సాధ్యం కాలేదు. దీని గురించి బోర్డు స్థాయిలో చర్చ జరిగింది. కట్టడం అత్యంత కీలక స్థలంలో ఉన్నందు వల్ల కాంట్రాక్ట్‌ రద్దు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో నిర్మాణ పనుల్లో జాప్యానికి సంబంధించి బాధ్యుడైన కాంట్రాక్టర్‌కు రూ.2.71 కోట్ల జరిమానా విధించి నిర్మాణ పనులు తక్షణమే కొనసాగించాలని సూచించారు.

కాంట్రాక్టర్‌కు రూ.2.71 కోట్ల జరిమానా

ఈ విషయమై పాలికె కమిషనర్‌, స్మార్ట్‌ సిటీ మాజీ ఎండీ డాక్టర్‌ రుద్రేష్‌ ఘాలి స్పందించారు. పనుల్లో జాప్యానికి కారకుడైన కాంట్రాక్టర్‌కు స్మార్ట్‌ సిటీ బోర్డు సూచన మేరకు రూ.2.71 కోట్ల జరిమానా విధించామని అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఇక అనివార్యంగా కాంట్రాక్ట్‌ రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ ప్రాజెక్ట్‌ పూర్వాపరాల గురించి ఆయన సూక్ష్మంగా వివరించారు. ప్రజల భాగస్వామ్యం కూడా ఈ మోడల్‌ ప్రాజెక్ట్‌కు ఉన్నందు వల్ల ప్రతి నెల పాలికెకు రూ.47 లక్షలు చెల్లించాలి. దీంతో ప్రభుత్వానికి లేఖ రాసి కాంట్రాక్ట్‌ను రద్దు చేయడానికి సర్కారు స్థాయిలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కాంప్లెక్స్‌లో 290 కార్ల పార్కింగ్‌కు అవకాశం ఉండటంతో పాటు కారుతో పాటు ప్రతి ఒక స్లాట్‌లో మూడు బైక్‌లకు కూడా పార్కింగ్‌కు అవకాశం కల్పించే రీతిలో డిజైన్‌ చేశామని ఆయన వివరించారు.

ఏడేళ్లయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం

సంబంధిత కాంట్రాక్ట్‌ రద్దుకు

నగర పాలికె మల్లగుల్లాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement