సహకార బ్యాంకుల సేవలు భేష్
హొసపేటె: సహకార బ్యాంకులు ప్రజల జీవితాల్లో అంతర్భాగం. సహకార బ్యాంకులు రైతులను, చిన్న వేతన జీవులను తమ ప్రధాన వినియోగదారులుగా చేసుకుని వారి గడపలకు చేరుకునే నిజమైన బ్యాంకులు, సహకార రంగం నిజమైన ఉద్దేశ్యం లాభం కంటే ప్రజల సంక్షేమం అని కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమశివమూర్తి తెలిపారు. బుధవారం కన్నడ విశ్వవిద్యాలయ మంటప సభాంగణంలో నిర్వహించిన సింధు శిశు కళ్యాణ డిపాజిట్ స్కీమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజమైన సహకారం ప్రజల మంచి కోసమేనని అన్నారు. సహకార బ్యాంకుల ఉద్దేశ్యం లాభాలను ఆర్జించడం మాత్రమే కాదు, లాభాలను ప్రజల మంచి కోసం ఎలా ఉపయోగించవచ్చో తెలపడమని అన్నారు. బ్యాంకులు తమ భవిష్యత్తు లక్ష్యాలను, ప్రణాళికలను ప్రజలతో పంచుకోవాలి, ప్రజల నమ్మకాన్ని సంపాదించాలన్నారు. విశ్వ విద్యాలయం సిబ్బంది, కో–ఆపరేటివ్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


