ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి
బళ్లారిటౌన్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నియామకాల్లో 5 ఏళ్ల వయోమితిని సడలించాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. సోమవారం డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యూ.ఎర్రిస్వామి జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. గతంలో పాలించిన బీజేపీ ప్రభుత్వం కూడా ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీని వల్ల నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక వంచితులు అవుతున్నారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే బాటలోనే కాలయాపన చేస్తూ వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా శాఖలో సుమారు 80 వేల దాకా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ఇక ఆరోగ్య శాఖలో 37 వేలు, పాలన మండలిలో 26 వేలు, పోలీస్ శాఖలో 8 వేలు, ఇతర 43 శాఖల్లో కలిపి మొత్తం 2,76,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సమితి నేతలు హనుమప్ప, నవీన్, జీఎం ఎర్రిస్వామి, తిప్పేరుద్ర, వరదరాజు, రాజేంద్రప్రసాద్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


