కర్ణాటక రాష్ట్రం: బార్‌లో మద్యం తాగే సమయంలో మిక్చర్ ఇచ్చే విషయానికి సంబంధించి బార్ క్యాషియర్, మద్యం తాగడానికి వచ్చిన వ్యక్తి మధ్య గొడవ జరిగి బార్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన క్యాషియర్‌ను వెంబడించి అతని ఇంట్లోనే భార్య, పిల్లల ముందే దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి తాలూకాలోని లక్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుమారస్వామి(43) హత్యకు గురైన వ్యక్తి. ఇదే గ్రామానికి చెందిన సుభాష్(24) అనే వ్యక్తి హత్య చేసిన నిందితుడు. వివరాలు.. అశోక వైన్స్‌లో కుమారస్వామి గత 25 ఏళ్లుగా ఎంతో విశ్వాసంతో పని చేస్తున్నాడు. కుమారస్వామి మూలతః చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహళ్లి గ్రామానికి చెందినవాడు. మృతుడికి భార్య, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
బార్ మూస్తుండగా మద్యం కొనుగోలు
ఆదివారం రాత్రి సుభాష్ బార్ మూసే సమయంలో మద్యం తీసుకుని మిక్చర్ అడిగాడు. అయితే బార్ మూసే సమయం కావడం వల్ల క్యాషియర్ కుమారస్వామి మిక్చర్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ విషయానికి సంబంధించి గొడవ పడిన సుభాష్ అంతటితో ఊరుకోకుండా కుమారస్వామిని ఇంటి వరకు వెంబడించి ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో చాకుతో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్పీ బి.నిఖిల్, డీఎస్పీ నాగ్తె, మాలూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సుభాష్ ను అరెస్టు చేశారు.


