రోజుకొక పేరు, వారానికో వర్గం
సాక్షి, బెంగళూరు: కన్నడ కాంగ్రెస్ పార్టీలో సీఎం ఆట జోరందుకుంది. సీఎం కుర్చీ కోసం నాయకులు ఆశల పందిళ్లలో ఊరేగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లను.. వెళ్లను అంటూనే ఆదివారం మధ్యాహ్నం హస్తినకు పయనమయ్యారు. అయితే హైకమాండ్ నాయకులు బిజీగా ఉండడంతో డీకే శివకుమార్ వారినెవరినీ కలవకుండానే రిక్తహస్తాలతో బెంగళూరుకు తిరిగి వచ్చేశారు. మిగిలిన ఇతర నాయకులు కూడా హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. డీకేకి పోటీగా, దళిత సీఎం అనే కొత్త రాగాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు అందుకున్నారు.
డీకే వ్యతిరేకుల కూటమి
సీఎం సిద్ధరామయ్య తర్వాత ఎవరు ఆయన వారసుడంటూ జోరుగా చర్చ సాగుతున్న తరుణంలో దళిత నేతే తదుపరి ముఖ్యమంత్రి కావాలని పలువురు నేతలు కోరుతున్నారు. హోం మంత్రి జి.పరమేశ్వర్ పేరు వినిపిస్తోంది. మంత్రి కేహెచ్ మునియప్ప సీఎం అయితే స్వాగతిస్తానని పరమేశ్వర్ చెప్పారు. వీరికి మంత్రి సతీశ్ జార్కిహొళి మద్దతు ప్రకటించారు. దళిత నేత ముఖ్యమంత్రి కావడం మంచిదే అన్నారు. ఇలా పరస్పరం మద్దతు పలుకుతూ డీకేశి వ్యతిరేకంగా గట్టి కూటమిని తయారు చేసే పనిలో ఉన్నారు. వీరికి సీఎం సిద్దరామయ్య అండగా ఉన్నట్లు డీకే మద్దతుదారులు అనుమానిస్తున్నారు.
నవంబరు 11న మళ్లీ ఢిల్లీకి
దళిత సీఎం డిమాండ్లు ఎక్కువవడంతో డీకే శివకుమార్ అప్రమత్తమయ్యారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నా ఏమీ జరగలేదు. మళ్లీ నవంబర్ 11న ఢిల్లీ టూర్ చేయబోతున్నారు. ఆరోజు రాహుల్ గాంధీతో భేటీకి అవకాశం కోరారు. అధికార పంపిణీ గురించి రాహుల్‌గాంధీతో చర్చించే అవకాశం ఉంది. ఆ రోజున బిహార్ రెండో దశ ఎన్నికల పోలింగ్‌తో ఎన్నికలు పూర్తవుతాయి. అందుకే అప్పటివరకు వేచిచూడక తప్పదు.
త్వరలో సిద్దరామయ్య సైతం..
నవంబర్ 15న లేదా 18న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఢిల్లీకి వెళ్లి నన్నే ఐదేళ్లూ కొనసాగించాలని కోరే అవకాశముంది. లేనిపక్షంలో తాను సూచించినవారికి పట్టం కట్టాలని సిద్దరామయ్య కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో పలువురు సీనియర్ దళిత నేతలు ఉన్నారు. వారిలో ఒకరిద్దరి పేర్లను సిఫార్సు చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రులతో డిన్నర్ మీటింగ్ నిర్వహించిన సీఎం తాజాగా మరోసారి నవంబరు 1వ తేదీన విందు జరపబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర, హెచ్‌సీ మహదేవప్ప వంటి దళిత నాయకులతో కూడా సీఎం సిద్ధరామయ్య మంతనాలు చేయబోతున్నారు.
ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్‌లో ఆగమాగం
డిప్యూటీ సీఎం ఢిల్లీ యాత్ర విఫలం
తెరపైకి దళిత సీఎం డిమాండ్
1వ తేదీన సీఎం విందు భేటీ
నాయకత్వానిదే నిర్ణయం: సీఎం
బనశంకరి: పదవుల కోసం పోటీ సహజమేనని సీఎం అన్నారు. సోమవారం మంగళూరులో విలేకరులతో సిద్దరామయ్య సీఎం మార్పు గురించి మాట్లాడుతూ హైకమాండ్ తీర్మానానికి వదిలిపెట్టామన్నారు. డీకే.శివకుమార్, పరమేశ్వర్, కేహెచ్.మునియప్ప సీఎం రేసులో ఉన్నారని విలేకరులు ప్రస్తావించగా, ప్రజాస్వామ్యంలో పోటీని తప్పించడం సాధ్యం కాదన్నారు. సీఎం స్థానానికి పోటీచేసే హక్కు అందరికీ ఉందన్నారు. నేను పదవిలో కొనసాగడం గురించి నాయకత్వం చేసే తీర్మానం అంతిమం అని తెలిపారు.
రోజుకొక పేరు, వారానికో వర్గం


