
చామరాజనగర బంద్
మైసూరు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి మీదకు రాకేష్ కిషోర్ అనే లాయరు బూటు విసరడాన్ని ఖండిస్తూ దళిత సంఘాలు శనివారం చామరాజనగర బంద్‌ను నిర్వహించాయి. బంద్ విజయవంతమైంది. థియేటర్లు, హోటళ్లు, షాపులు, ఆఫీసులు మూతపడ్డాయి. ఉదయం నుంచి దళిత సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. బస్టాండు ముందు బైఠాయించారు. దాంతో మధ్యాహ్నం వరకు బస్సులు కదలలేదు. అనేక జిల్లాలలో దళిత సంఘాల ఆందోళనలు జరిగాయి.
ఏబీసీ వర్గీకరణలో చుక్కెదురు
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా ఉప వర్గీకరణ చేసి విడుదల చేసిన నోటిఫికేషన్ కింద ఎలాంటి ఉద్యోగ నియామకాలను చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదివరకే ఆరంభమైన నియమాకాలను కొనసాగించవచ్చని సూచించింది. ఆగస్టు ఆఖరులో చేసిన ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అస్పృశ్య సంచార సముదాయాల ఒక్కూట, సంచార సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ విచారించారు. వర్గీకరణను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అశాసీ్త్రయంగా ఉందని, ప్రభుత్వం సక్రమంగా చేయలేదని ఆరోపించారు. వాదనలను ఆలకించిన జడ్జి సర్కారు ఉత్తర్వులపై స్టే జారీచేశారు.
ఖాకీ చేతిలో
మాజీ భార్య హత్య
● బెళగావి జిల్లా సవదత్తిలో ఘటన
రాయచూరు రూరల్: బెంగళూరులో డాక్టరు చేతిలో భార్య హత్య జరిగిన విషయం మరిచిపోకముందే, ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఆపై విడాకులు పొందిన మాజీ భార్యను పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన ఘటన బెళగావి జిల్లా సవదత్తిలో చోటు చేసుకుంది. బైలహొంగల తాలూకా బెళవడికి చెందిన కాశమ్మ (34) ని, బనజవాడకు చెందిన సంతోష్ కాంబ్లే హత్య చేశాడని పోలీసులు తెలిపారు. వివరాలు.. సవదత్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న కాశమ్మ, కానిస్టేబుల్ సంతోష్ 13 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరైనా పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. కొన్నాళ్లకే అనుమానంతో భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అతని పోరు పడలేక ఆమె సవదత్తిలో ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా ఉండేది. ఐదు నెలల క్రితం మంజూరయ్యాయి. ఇదంతా అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నెల 13న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చింది. సంతోష్ ఇంటికొచ్చి ఆమెను హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. కుళ్లిన శరీరం నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల ప్రజలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హంతకున్ని అరెస్టు చేశారు.
హనీట్రాప్‌కు యువకుడు బలి
● యువతి, ముఠా సభ్యుల బెదిరింపులు
● ఉడుపి జిల్లాలో సంఘటన
యశవంతపుర: ఉడుపి జిల్లా కార్కళ తాలూకా నిట్టె గ్రామానికి చెందిన అభిషేక్ (25) అనే యువకుడు స్థానిక లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు డెత్‌నోటు ద్వారా బయటపడింది. అభిషేక్ ప్రభుత్వ గోషా ఆస్పత్రిలో ల్యాబ్‌లో ఉద్యోగి అని తెలిసింది. అభిషేక్, నిరీక్ష అనే యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె మరో యువకునితోనూ ప్రేమాయణం నడుపుతోందని సమాచారం. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను చూపి డబ్బులు ఇవ్వాలని ఆమె అభిషేక్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. భయపడిన అభిషేక్ డబ్బులను ఇచ్చాడు. మళ్లీ రూ. 4 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని, కేసు పెడతానని బెదిరించింది. కొన్నిసార్లు దాడి కూడా చేసింది. ఈ వేధింపులతో భయపడిన బాధితుడు లాడ్జిలో డెత్‌నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిరీక్ష మంగళూరుకు చెందిన రాకేశ్, రాహుల్, తస్లీమ్‌లతో కలిసి అభిషేక్‌ను హనీట్రాప్ చేసిందని పోలీసుల విచారణలో బయట పడింది. యువతి ఫోటోలు వైరల్ అయ్యాయి.

చామరాజనగర బంద్