
ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన
రాయచూరు రూరల్: విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలని కలబుర్గి డివిజన్ విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం డివిజన్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. రామాయణం, మహభారత్‌లో దాగి ఉన్న అంశాలను క్షుణ్ణంగా అవలోకనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిరాజ్, చంద్రశేఖర్ భండారి, గోవింద రెడ్డి, వీరేంద్ర పాటిల్, సంగమేష్, సుజాత, బసప్ప తదితరులు పాల్గొన్నారు.
కాడసిద్దేశ్వర స్వామికి నో ఎంట్రీ
హుబ్లీ: లింగాయత మఠాధిపతుల గురించి ఓ బహిరంగ కార్యక్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామికి విజయపుర జిల్లా ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారి డాక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16 నుంచి డిసెంబర్ 16 వరకు విజయపుర జిల్లాలో ప్రవేశించకుండా నిర్భంధం విధించారు. బసవ సంస్కృతి అభియాన్‌ను విమర్శించే దిశలో మాట్లాడిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామి.. లింగాయత మఠాధీశుల ఒక్యూటను ముఖ్యమంత్రి కృపాపోషిత నాటక బృందం అనడమే కాకుండా, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై విధాన సభ విపక్ష నేత అశోక్, ఎంపీ జగదీశ్ శెట్టర్, ప్రతాప్ సింహ తదితరుల ఫిర్యాదు మేరకు జిల్లాధికారి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.