రూ.2.15 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.2.15 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

Oct 15 2025 6:30 AM | Updated on Oct 15 2025 6:30 AM

రూ.2.

రూ.2.15 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

బనశంకరి: బెంగళూరు లో డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల 15 లక్షల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్‌, కొకైన్‌ ను స్వాధీనం చేసుకున్నారని పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ మంగళవారం తెలిపారు. ఒకేచిన్యాడు సామ్యూల్‌, క్యూకిరిజా టోపిస్టా అనే ఇద్దరు పట్టుబడగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్‌సిటీ మహాలక్ష్మీ లేఔట్‌లో డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు తెలిసి అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిద్దరూ 2011 లో నైజీరియా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌, వీసాతో నగరంలో మకాం వేసి, ఐటీ ఉద్యోగులకు మత్తు పదార్థాలను విక్రయించేవారు.

ఐపీఎస్‌ అలోక్‌కు ఊరట

శివాజీనగర: సీనియర్‌ ఐపీఎస్‌, అదనపు డీజీపీ అలోక్‌కుమార్‌ మీద ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వ విచారణను కేంద్ర పరిపాలనాత్మక న్యాయమండలి (సీఏటీ) రద్దు చేసింది. అంతేకాకుండగా నిలిపివేసిన ఆయన పదోన్నతి, ఇతర సదుపాయాలను ఇవ్వాలని ఆదేశించింది. కొన్నేళ్లుగా ఈ కేసు నలుగుతోంది. గతంలో ఇద్దరు క్యాట్‌ జడ్జిలు అనుకూల, వ్యతిరేక తీర్పులను ఇచ్చారు. దీంతో కేసు క్యాట్‌ ప్రధాన న్యాయమూర్తి రణ్‌జీత్‌కు చేరింది. ఇరువైపుల వాదనలను ఆలకించి మంగళవారం అలోక్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖభంగమైంది. 2019లో కాంగ్రెస్‌– జేడీఎస్‌ సర్కారు హయాంలో అలోక్‌కుమార్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదైంది.

కన్నుపడితే కార్లలో

సొత్తు మాయం

యశవంతపుర: విలాసవంతమైన కార్ల అద్దాలను ధ్వంసం చేసి అందులోని వస్తువులను చోరీచేసే ప్రముఖ రామ్‌జీ ముఠాలోని ముఖ్యమైన దొంగని బెంగళూరు విజయనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన జైశీలన్‌, 19 ఏళ్లు కొడుకు దీన్‌దయాళ్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో కారు అద్దాలను పగులగొట్టి డబ్బు, నగలు, ల్యాప్‌టాప్‌లు వంటి సొత్తును ఎత్తుకెళ్లాడు. పోలీసులకు ఈ తండ్రీ కొడుకులు తలనొప్పిగా మారారు. తమిళనాడులో దాగి ఉన్న జైశీలన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా కొడుకు దీన్‌ దయాళ్‌ తప్పించుకున్నాడు. మూడు నెలలకోక్కసారి తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చి కార్లలో చోరీలకు పాల్పడేవారు. బెంగళూరు నుంచి బెళగావి వరకు వీరిపై కేసులున్నాయి.

కాలేజీ పై నుంచి దూకి ఆత్మహత్య

యశవంతపుర: కాలేజీ భవనం మీద నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు రిచర్డ్‌ టౌన్‌లో జరిగింది. పియూసీ రెండో ఏడాది అబ్బాయిగా తెలిసింది. సోమవారం ఉదయం 8:20 గంటలకు విద్యార్థులు ప్రార్థనకు సిద్ధం అవుతుండగా పై అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా కొన్నిగంటల తరువాత చనిపోయాడు. అతడు చదువు, ఆటల్లో చురుగ్గా ఉండేవాడని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని అధ్యాపకులు చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

బైక్‌ను టెంపో ఢీ,

బాలుడు మృతి

దొడ్డబళ్లాపురం: బైక్‌ను టెంపో ఢీకొని కుమారుడు చనిపోగా, తండ్రి తీవ్ర గాయాలపాలైన సంఘటన మాగడి–హులియూరుదుర్గ రోడ్డులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బైక్‌ కుణిగల్‌ తాలూకా నాగనహళ్లికి చెందిన తండ్రి, కుమారుడు నాగేశ్‌ (51), హర్ష (14) వస్తున్నారు. సిమెంటు లోడుతో మాగడి వైపు నుంచి వస్తున్న టెంపో బైక్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ రభసకు టెంపో, బైక్‌ రెండూ రోడ్డుపక్కన పొలాల్లోకి బోల్తా పడ్డాయి. బాలుడు హర్ష గాయాలతో మరణించగా, నాగేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

రూ.2.15 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత   1
1/1

రూ.2.15 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement