
బాంబు బెదిరింపులు ఎవరి పని?
దొడ్డబళ్లాపురం: సీఎం, డీసీఎం ఇళ్లల్లో బాంబు పెట్టి పేల్చేస్తామని వచ్చిన బెదిరింపుల వెనుక ఎవరున్నారో తేల్చడానికి పోలీసుశాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. అలాగే కాలేజీలు, బడులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్‌పోర్టులు తదిరత చోట్ల బాంబులు పెట్టినట్టు వస్తున్న ఈమెయిల్స్, ఫోన్ కాల్స్‌పైనా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఒకటిన్నర ఏడాదిగా ఒక్క బెంగళూరులోనే 34 ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
సీఎం, డీసీఎం ఇళ్లను పేల్చేస్తామని
తాజాగా గత శనివారం తెల్లవారుజామున సీఎం,డీసీఎం ఇళ్లను పేల్చేస్తామని, 4 కేజీల ఆర్‌డీఎక్స్, ఐఈడీలను అమర్చినట్లు ఈమెయిల్ వచ్చింది. సీఎం సిద్ధరామయ్య,డీసీఎం డీకే శివకుమార్ ల అధికారిక ఈ మెయిల్ ఐడీకి కూడా ఇదే మెయిల్ వచ్చింది. వెంటనే పోలీసులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేసి ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. గత ఏడాది అక్టోబర్‌లో బసవనగుడిలోకి కాలేజీకి ఇదేవిధంగా బాంబు బెదిరింపు కాల్ రాగా, వీవీ పురం పోలీసులు గాలింపు జరిపి ప శ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో నిందితున్ని అరెస్టు చేసారు. అతని ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతడు 10 కేసుల్లో వాంటెడ్‌గా గుర్తించారు. తరచూ నకిలీ ఫోన్ కాల్స్ వల్ల ప్రజల్లో భయాందోళనతో పాటు పోలీసులకు ఎంతో సమయం వృథా అవుతోంది.
విచారణకు సిట్ ఏర్పాటు

బాంబు బెదిరింపులు ఎవరి పని?