దిగుబడి ఉన్నా.. ఉల్లి ధర సున్నా | - | Sakshi
Sakshi News home page

దిగుబడి ఉన్నా.. ఉల్లి ధర సున్నా

Oct 15 2025 6:10 AM | Updated on Oct 15 2025 6:30 AM

సాక్షి బళ్లారి: గత కొన్ని నెలలుగా ఉల్లిగడ్డల ధర పడిపోవడంతో పాటు రోజు రోజుకు ధరలు మరింత తగ్గిపోవడంతో ఉల్లి సాగు చేసిన రైతులకు కన్నీరు మిగుల్చుతోంది. ఆరుగాలం కష్టపడి పని చేసి పంట చేతికి అందిన తర్వాత రైతులకు పెట్టుబడి కాదు కదా కనీసం పంటను పీకడానికి కూడా అయ్యే ఖర్చు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉల్లి రైతులు పొలాల్లోనే పంటను వదిలివేసి ఆందోళనల బాటపట్టారు. కిలో రూ.1 నుంచి రూ.5ల లోపు రైతు వద్ద కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వస్తుండటంతో చేసేది ఏమీ లేక రైతులు పొలాల్లోనే ఉల్లిపంటను వదిలేశారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో గతంలో ఎన్నడూ సాగు చేయని విధంగా దాదాపు 80 వేలకు పైగా ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేశారు. జిల్లాలోని సిరుగుప్ప తాలూకా దాసాపుర గ్రామంలో పోసేరావు, అంజినప్ప, హులెప్ప, నాగప్ప, దొడ్డమల్లనగౌడ, నాగప్ప, శేఖరప్ప, రుద్రప్ప ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామంలో 80 శాతానికి పైగా రైతులు ఉల్లిసాగు చేశారు.

మిర్చి కంటే ఉల్లి నిండా ముంచింది

ప్రతి రైతు నాలుగు ఎకరాల నుంచి 15 ఎకరాల దాకా ఉల్లి పంటను సాగు చేశారు. అలాగే కొంచిగేరి గ్రామంలో మల్లికార్జున, గంగన్న, ఎర్రిస్వామి తదితర రైతులు పెద్ద సంఖ్యలో ఉల్లిసాగు చేయగా సిరిగేరి, ఉమ్మడి బళ్లారి జిల్లాలోని విజయనగర జిల్లాలో కూడ్లిగి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారు. గత మూడేళ్లుగా మిర్చి ధర పెరగక పోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా మిర్చి రైతులకు చేతికి అందకపోవడంతో ఉల్లి పంటను సాగు చేస్తే గట్టెక్కుతామని ఆశించిన రైతులకు మిర్చి కంటే ఉల్లి మరింత నిండా ముంచిందని దాసాపుర గ్రామానికి చెందిన పోసేరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తాను 15 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేయగా ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టామన్నారు. ప్రస్తుతం పెట్టుబడి కాదు కదా కనీసం పంటను పీకడానికి కూడా రాకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నామన్నారు.

రైతులకు ఆత్యహత్యలే శరణ్యం

ఇది నా ఒక్క రైతు బాధ కాదని, సిరుగుప్ప తాలూకా, ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉల్లి సాగు చేసిన ప్రతి రైతుకు ఈసారి పెట్టుబడి రాక అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఉల్లి గడ్డల ధర పెరిగితే ప్రభుత్వాలు కదిలి వచ్చి పేద వినియోగదారులకు నష్టం జరుగుతుందని ఏపీఎంసీల్లో సబ్సిడీతో ఉల్లిగడ్డలు విక్రయిస్తారని, అదే రైతుకు ధర తగ్గిపోతే ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండిపడ్డారు. ఇలా ఉల్లి సాగు చేసిన ప్రతి రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. పొలాల్లోనే ఉల్లి పంటను వదిలేసిన రైతులు కోకొల్లలు. ఉల్లి పంటను చేతపట్టుకొని ఆందోళన చేపట్టే రైతులు కొందరు, ఉల్లి గడ్డలతో శవయాత్ర చేపడుతూ ఆందోళనలు చేసే రైతులు మరికొందరు, ఉల్లి పంటను కుప్పపోసి మంట పెట్టే రైతులు ఇంకొందరు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటక పరిధిలోని బాగల్‌కోటె, విజయపుర, గదగ్‌, కొప్పళ తదితర జిల్లాల్లో ఉల్లి సాగు చేసిన రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడంతో గత్యంతరం లేక రైతులు పోరుబాట పట్టారు.

విస్తారంగా పండిన ఉల్లి పంట

ఉల్లిగడ్డలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉల్లి రైతులు

రైతుకు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి పంట

పంట తొలగింపు ఖర్చులు కూడా రాని వైనం

ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టపోయిన రైతు

ఉమ్మడి జిల్లాలో 80 వేలకు పైగా

ఎకరాల్లో సాగు

ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు

గిట్టుబాట ధర కల్పించాలని రైతుల నిరసనలు

ఉత్తర కర్ణాటకలో కూడా లక్షలాది ఎకరాల్లో సాగు

ధర పతనంతో ఉల్లిగడ్డలతో రైతుల శవయాత్ర

దిగుబడి ఉన్నా.. ఉల్లి ధర సున్నా 1
1/1

దిగుబడి ఉన్నా.. ఉల్లి ధర సున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement