
అలరించిన నాటక ప్రదర్శన
బళ్లారిఅర్బన్: కన్నడ సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో అనురాగ పల్లవి సాంస్కృతిక కళా ట్రస్ట్, దేవలాపుర కందగల్ హనుమంతరాయ ఆధ్వర్యంలో రక్తరాత్రి అనే కన్నడ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ప్రముఖులు ప్రభుదేవ కప్పగల్ మాట్లాడుతూ బళ్లారిలో రాఘవ, జోళదరాశి దొడ్డనగౌడ, సుభద్రమ్మ, బెళగల్ వీరన్న తదితరులు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించి బళ్లారి జిల్లాకు ఎనలేని ఖ్యాతిని సాధించారన్నారు. తిప్పేస్వామి, యోగేష్, మురళి చెళ్లకెరె, వీరేష్ బెళగావి తదితరులు నాటకంలో వివిధ పాత్రలు పోషించారు.
రైతు కుటుంబానికి పరిహారం పంపిణీ
హుబ్లీ: చెట్టు కూలిపడి మరణించిన హానగల్ రైతు ఫకీరప్ప పాండప్ప కుటుంబానికి సర్కారు ద్వారా విడుదలైన రూ.5 లక్షల పరిహారధనం సొమ్మును ఆ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ మానె అందజేశారు. ఆ మేరకు మృత రైతు ఫకీరప్ప భార్య పార్వతవ్వకు అక్కడి తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఈ పరిహారం అందించారు. ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి ద్వారా ఎటువంటి కేసులను పెండింగ్‌లో ఉంచకుండా పరిహారం విడుదలకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు సంబంధిత రైతు బాంధవులకు అండదండగా నిలబడటమే ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. తహసీల్దార్ రేణుక, పురసభ మాజీ అధ్యక్షుడు యల్లప్ప, సిద్దనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్వతి నగర్ నివాసి కిచడి రామప్ప అనే 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి అదృశ్యమైనట్లు హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి 5.9 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీరఛాయ కలిగి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎరుపు రంగు ఫుల్ స్లీవ్స్ షర్ట్, నీలం చారల లుంగీ ధరించాడు. కన్నడలో మాట్లాడగల ఈ వ్యక్తి ఆచూకీ గురించి తెలిస్తే టౌన్ పోలీస్ స్టేషన్ పీఐకు సమాచారం అందించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ప్రకటనలో తెలిపారు.
స్కూల్ హాస్టల్‌లో వంట గ్యాస్ లీకేజీ
●త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
హొసపేటె: నగరంలోని ఎల్‌ఎఫ్‌ఎస్ స్కూల్ హాస్టల్‌లో మంగళవారం పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ సంభవించింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీక్ జరిగిన వెంటనే తల్లిదండ్రులు, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది పాఠశాలలో నుంచి పిల్లలను బయటకు పంపించారు. గ్యాస్ లీక్ జరిగినప్పుడు హాస్టల్‌లో దాదాపు 50–60 మంది పిల్లలు ఉన్నారు. విషయం తెలియగానే పట్టణ పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, తల్లిదండ్రులు, నాథలియన్ సాంగ్లీ అనే హోం గార్డు ఘటన స్థలానికి చేరుకుని లీకేజీని ఆపారు. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఆర్‌ఎస్‌ఎస్ నిషేధానికి లేఖ రాయడం తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కళ్యాణ కర్ణాటక భాగంలో వరదలతో నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని సీఎం సిద్దరామయ్యకు లేఖ రాయాలే తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని లేఖ రాయడం సమంజసం కాదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నవంబర్, డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ధ్రువీకరణ కాబోతున్న తరుణంలో అధిష్టానం మెప్పు పొందడానికి తోడు ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశతో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని లేఖ రాయడం అవివేకమన్నారు. రైతుల పంటలు వరదలకు కొట్టుకుపోవడంతో నష్టాల బాటలో ఉన్న వారిని ఆదుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈసందర్భంగా యల్లప్ప, మల్లికార్జున, తిమ్మప్ప, భీమన్న, మౌనేష్, సంతోష్ తదితరులున్నారు.

అలరించిన నాటక ప్రదర్శన

అలరించిన నాటక ప్రదర్శన

అలరించిన నాటక ప్రదర్శన