
ఈ ఏడాది నుంచే అమలులోకి
ప్రభుత్వ నిర్ణయం
పదో తరగతి.. లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది.
శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు.
206 మార్కులు చాలు
బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
పారదర్శకంగా పరీక్షలు
రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్‌కు ఇది వర్తిస్తుందని చెప్పారు.