
డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ.!
సాక్షి,బళ్లారి: భావి తరాలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న జిల్లా విద్యా శాఖాధికారి(డీడీపీఐ) కార్యాలయంలో మందు పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడ 20 లీటర్ల క్యానులోకి మందును పోసుకుని తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల చిత్రదుర్గలోని డీడీపీఐ కార్యాలయంలో అక్కడ పని చేసే సిబ్బంది కొందరు 20 కొన్న మందు బాటిళ్లను తీసుకుని 20 లీటర్ల క్యానులోకి మందును పోశారు. అక్కడే నీళ్లు కలిపి, డీడీపీఐ కార్యాలయంలోనే మందు రుచి చూశారు.
వీడియో వైరల్‌తో సిబ్బంది సస్పెండ్
కొందరు అక్కడ సేవించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కారులో మందు క్యాను తరలించిన వీడియో వైరల్ కావడంతో చిత్రదుర్గం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలోకి యథేచ్ఛగా మందు బాటిళ్లు తీసుకుని రావడంతో పాటు అక్కడే ఓ క్యానులోకి మందు పోసి, నీళ్లు పోసి మందు, నీళ్లు మిక్స్ చేసుకుని ఒకకొకరు తాగి భలే బాగుందని మాట్లాడుకున్నారు. ఎంతో దర్జాగా కారులో తరలించడంతో అక్కడ పని చేసే సిబ్బంది అవాక్కయ్యారు.
ఉపాధ్యాయుల మండిపాటు
ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయమైన డీడీపీఐ కార్యాలయంలో ఇలాంటి కృత్యానికి ఒడిగట్టడంపై యావత్ ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో చిత్రదుర్గ డీడీపీఐ వెంటనే మేల్కొని అక్కడ మందు క్యానులోకి పోసి, తాగిన సిబ్బంది అయిన రవికుమార్, గణేష్, తిప్పేస్వామి, సునీల్‌కుమార్ అనే నలుగురిని సస్పెండ్ చేశారు. అయితే డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్న సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదని, వారిని డిస్మిస్ చేసి కేసులు నమోదు చేస్తే, మళ్లీ ఇతరులకు భయం పుడుతుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
20 లీటర్ల క్యానులోకి మందు పోసి పార్టీ చేసుకున్న సిబ్బంది
ప్రభుత్వ ఆఫీసులను మందు పార్టీకి వేదిక చేసుకుంటున్న వైనం
కార్యాలయంలోకి 20 లీటర్ల మందును సిద్ధం చేసుకుని తరలింపు

డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ.!

డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ.!