
అభివృద్ధికి అందరూ పట్టం
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, సభ్యుల నిర్ణయంతో పనులు చేపట్టామని ఆర్‌డీఏ సభ్యుడు నరసింహులు తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడు నెలల నుంచి కార్పొరేషన్‌గా ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు సామాన్య సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులకు అధికారుల సలహా, సూచనలు పాటించాలన్నారు. కార్పొరేషన్‌గా ఏర్పాటైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.200 కోట్ల నిధులను అన్ని 35 వార్డులకు సమానంగా కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అధికారులు, అధ్యక్షులు, ఇతర పార్టీల నిర్ణయాలతో నిధులు వాడుకున్న అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ–ఖాతాలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో నగరసభ సభ్యులు బసవరాజ్, శ్రీనివాసరెడ్డి, జిందప్ప తదితరులు పాల్గొన్నారు.