
వైభవంగా గణ హోమ పూజలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్‌మెంట్ తాలూకా ప్రణాళికా కార్యాలయంలో ఆయుధ, గణ హోమ పూజ మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి కార్యాలయాన్ని సిబ్బంది పూలమాలలు, రంగోలీలతో అలంకరించారు. లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి వివిధ రకాల పూలతో అమ్మవారికి ప్రత్యేక మహా మంగళారతి నిర్వహించారు. తరువాత ప్రసాద వితరణ చేశారు. తాలూకా ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ మాట్లాడుతూ నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు శక్తి దేవతలను పూజిస్తారు. కోరికలు నెరవేరాలని ప్రార్థనలు చేస్తారు. దీపావళి పండుగలో భాగంగా దేవిని పూజించడానికి కార్యాలయంలో గణహోమ పూజ నిర్వహించామన్నారు. పట్టణ పంచాయతీ అధ్యక్షుడు కావలి శివప్ప నాయక, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, సీఐ ప్రహ్లాద్ ఎస్ చెన్నగిరి పాల్గొన్నారు. జన జాగృతి వేదిక సభ్యులు కక్కుప్పి గుండప్ప, హడగలి వీరభద్రప్ప, జీఆర్ సిద్దేశ్వర్, పవిత్ర, వ్యవసాయ పర్యవేక్షకుడు మహాలింగయ్య, జ్ఞాన వికాస్ కేంద్ర సమన్వయకర్త సరస్వతి, మండలాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.