
ఏకపక్ష నిర్ణయాలు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో ఏకపక్ష నిర్ణయాలతో సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నగరసభ సభ్యులు ఆరోపించారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కౌన్సిలర్లు శశిరాజ్, నాగరాజ్ తదితరులు మాట్లాడారు. ఏడు నెలల నుంచి కార్పొరేషన్‌గా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు సామాన్య సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కార్పొరేషన్‌గా ఏర్పాటైనప్పడు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 35 వార్డులకు రూ.కోటి చొప్పున కేటాయించి అభివృద్ధి పనులు చేపడతారని కన్న కలలు సాకారం కాకుండా పోయాయన్నారు. అధికారులు, అధ్యక్షుల ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా నిధులు వాడుకున్న అంశంపై విచారణ చేయాలన్నారు. రాజకీయ నాయకుల మాటలకు వత్తాసు పలుకుతూ నగరసభ సభ్యులను అవమానించడం తగదన్నారు. ఇ–ఖాతాలు, జనన మరణ పత్రాలు ఇవ్వడంలో పూర్తిగా ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు.