ఆగి ఉన్న లారీని బస్సు ఢీ.. | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ..

Oct 2 2025 8:36 AM | Updated on Oct 2 2025 8:36 AM

ఆగి ఉ

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ..

నలుగురికి గాయాలు

కనగానపల్లి: అనంతపురం సమీపంలో కనగానపల్లి వద్ద పర్వతదేవరపల్లి సమీపంలో బెంగళూరు–హైదరాబాద్‌ 44వ హైవేలో బుధవారం ఐచర్‌ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వివరాలు.. బెంగుళూరు నుంచి ఆదోని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై పక్కనే ఆగి ఉన్న ఐచర్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న గౌస్‌, వంశీ, పరుశురామ్‌, పురుషోత్తం గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడిన గౌస్‌ను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

జిమ్‌ ట్రైనర్‌పై రాడ్లతో దాడి

బనశంకరి: జిమ్‌లోకి చొరబడిన ఐదుగురు ట్రైనర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆనేకల్‌ పట్టణ నివాసి సందీప్‌ హెబ్బగోడి అనంతనగర రిప్డ్‌ జిమ్‌లో ట్రైనర్‌గా ఉన్నాడు. అనుషా అనే యువతి జిమ్‌లో సందీప్‌ వద్ద శిక్షణ పొందుతోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకునేవారు. యువతి సోదరులు గౌతమ్‌, అరుణ్‌లు ఆమె మొబైల్‌ పరిశీలించారు. తన మొబైల్‌ హ్యాక్‌ అయినట్లు అనుషా పేర్కొంది. అనంతరం అరుణ్‌, గౌతమ్‌, మరో ముగ్గురు జిమ్‌లోరి చొరబడి సందీప్‌పై రాడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సందీప్‌ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దాడి దృశ్యాలు జిమ్‌లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై కేసు నమోదైంది.

డీకేశి సీఎం అవుతారు

ఎమ్మెల్యే డాక్టర్‌ రంగనాథ్‌

శివాజీనగర: ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ తన రాజకీయ గురువని, ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతారని కుణిగల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రంగనాథ్‌ జోష్యం చెప్పారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందడంలో డీకే శివకుమార్‌ పాత్ర చాలా ఉందన్నారు. డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రస్తుతానికి సీఎం సిద్దరామయ్య రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు.

మారికాంబ దేవికి విశేష అలంకరణ

మాలూరు: దేవి నవరాత్రుల్లో భాగంగా పట్టణంలోని మారికాంబ దేవాలయంలో అమ్మవారికి బుధవారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మూల విగ్రహానికి అభిషేకం అనంతరం పూలతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

నియామకం

మాలూరు: ప్రసిద్ద చిక్కతిరుపతి ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపనా సమితి అధ్యక్షుడిగా ఆలంబాడి గ్రామానికి చెందిన గోపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతన అధ్యక్షుడు గోపాల్‌ను ఎమ్మెల్యే కేవై నంజేగౌడ అభినందించారు. ప్రధాన అర్చకులతో పాటు మొత్తం 9 మంది సభ్యులను ఎంపిక చేశామన్నారు. నూతనసమితి సభ్యులు దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నారు. ఆలయ ఈఓ సెల్వమణి, తాపం మాజీ స్థాయీ సమితి అధ్యక్షుడు నాగేష్‌ పాల్గొన్నారు.

స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వండి

శ్రీనివాసపురం: ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలని ఉప లోకాయుక్త బి.వీరప్ప సలహా ఇచ్చారు. తాలూకాలోని లక్ష్మీ సాగర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామంలో పలుచోట్ల స్వచ్ఛత కొరవడిందన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ సౌలభ్యాలను ప్రతి ఒక్కరికీ అందించాలన్నారు.

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ.. 1
1/2

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ..

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ.. 2
2/2

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement