
కుటుంబ నియంత్రణ నియమాలు పాటిద్దాం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సంక్షేమ, నియంత్రణ నియమాలను పాటించాలని కుటుంబ నియంత్రణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీ.ఏ.మాలి పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచూరులో భారతీయ కుటుంబ నియంత్రణ సంఘం(ఎఫ్‌పీఏఐ) భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మురికి వాడల ప్రాంతాల్లో నివసించే వారికి ఆరోగ్యపరమైన విషయాల గురించి వివరించడంలో ఎఫ్‌పీఏఐ ప్రముఖ పాత్రను పోషిస్తోందన్నారు. 9–14 ఏళ్ల మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలికలకు భవిష్యత్తులో సెర్వికల్ క్యాన్సర్ వ్యాధి రాకుండా నియంత్రణకు తల్లిదండ్రుల అనుమతి మేరకు ఆరు నెలలకు ఒకసారి హెచ్‌పీవీ ఇంజెక్షన్ ఇస్తారన్నారు. దాతల నుంచి వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నుంచి ఓపీడీని ప్రారంభించి ప్రజలకు వైద్య సౌకర్యాలను కల్పిస్తారన్నారు. సమావేశంలో డాక్టర్ బసనగౌడ, మహాలింగప్ప, విరుపాక్షరెడ్డి, ఇందర్ చంద్ సింగ్వి, రాజకుమారి, ఆలియా ఖానంలున్నారు.