
ఆల్మట్టి డ్యాంలో 7.5 టీఎంసీల పూడిక
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంభిస్తోంది. కృష్ణా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకోడానికి అవకాశం ఉంది. 2023లో కర్ణాటక ఇంజినీరింగ్ పరిశోధన కేంద్రం జరిపిన సర్వేలో ఆల్మట్టి డ్యాంలో 7.5 టీఎంసీల మేర పూడిక పేరుకుంది. 123.081 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ డ్యాంలో 7.5 టీఎంసీల మేర పూడిక పేరుకొంది. ఆల్మట్టి డ్యాం పరిధిలోని హిప్పరిగి జలాశయం నుంచి కర్ణాటక ఇంజినీరింగ్ పరిశోధన కేంద్రం అధికారి కేజీ మహేష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. నారాయణపూర్ డ్యాంలో 10.550 టీఎంసీల మేర పూడిక పేరుకున్నట్లు అధికారులు తెలిపారు. బాగల్‌కోటె, విజయపుర, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, గదగ్, కొప్పళ జిల్లాల జీవనాడి కృష్ణా నది ఆయకట్టు కింద 5.30 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం అందుబాటులో ఉంది.
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే
బళ్లారిఅర్బన్: నగర ప్రజల ఆరాధ్య దేవత కనకదుర్గమ్మ ప్రత్యేక ఆశీస్సులను దసరా పండుగ సందర్భంగా నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అందుకున్నారు. ఆలయ పూజారులు ఆయనను ప్రత్యేకంగా ఆలయ మర్యాదలతో సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా నారా భరత్‌రెడ్డి ఆలయం వద్ద భక్తులతో మాట్లాడుతూ పరస్పరం దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుష్ట సంహారానికి ప్రతీకగా రావణ దిష్టిబొమ్మ దహన ప్రక్రియలో పాల్గొన్నారు.
సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
● మృతులిద్దరూ తల్లీకుమారులు
సాక్షి, బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హొసపేటె తాలూకా గాదిగనూరు గ్రామంలో గతనెల 27వ తేదీన సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడిన 11 మందిలో ఇద్దరు మృతి చెందారు. సిలిండర్ పేలుడులో కుటుంబ తీవ్రంగా గాయపడటంతో పాటు ఇంటి పైకప్పు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హాలప్ప(43), గంగమ్మ(80) అనే తల్లీ కుమారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గ్యాస్ స్టౌ వెలిగించడానికి ప్రయత్నించగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో కవిత(32), హాలప్ప(42), మైలారప్ప(48), మల్లమ్మ(40), కావేరి(18), కావ్య(15), నిఖిల్ (13) గాయపడిన నేపథ్యంలో తోరణగల్లు ప్రభుత్వ, జిందాల్ సంజీవిని ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించిన సంగతి విదితమే.
మహాత్ముడి బాటలో నడవాలి
శ్రీనివాసపురం : మహాత్మాగాంధీ అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్ర తీసుకు వచ్చారని, ఆయన ఆదర్శ తత్వ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పీడీఓ మాళికాంబ పిలుపునిచ్చారు. తాలూకాలోని తళసనూరు గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాత్ముడు శాంతియుత పోరాటంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టారన్నారు. సమాజంలోని అందరూ ఆర్థికంగా, సామాజికంగా సమానత సాధించాలని గాంధీజీ ఆశించారన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలలో పరిశుభ్రతను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు స్వాతి జయ ప్రకాష్, ఉపాధ్యక్షురాలు మమత, మాజీ ఉపాధ్యక్షుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆల్మట్టి డ్యాంలో 7.5 టీఎంసీల పూడిక