
శక్తిదేవతకు అక్షరాంజలి
మైసూరు: చాముండేశ్వరి అమ్మవారికి అగ్రపూజలు జరిపి మైసూరు దసరా ఉత్సవాలకు ప్రముఖ రచయిత్రి, కన్నడిగురాలు బాను ముష్తాక్ నాంది పలికారు. సోమవారం ఉదయం 10 గంటల తరువాత మైసూరు చాముండి గిరులపై ఆడంబరంగా ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మొదట బాను ముష్తాక్, సీఎం సిద్దు చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. శక్తి దేవతకు సంప్రదాయ రీతిలో బాను ముష్తాక్ పూజలు చేశారు.
ఉదయాన్నే ఐరావత బస్సులో బాను ముష్తాక్, ఆమె కుటుంబ సభ్యులు చాముండి కొండకు చేరుకున్నారు. సీఎం, మంత్రులు కలిసి మహిష విగ్రహం వద్ద వారికి స్వాగతించారు. తరువాత చాముండేశ్వరి ఆలయంలో గర్భగుడికి వెళ్లారు. జానపద కళా బృందాల స్వాగత నృత్యాలు అబ్బురపరిచాయి. అమ్మవారికి మంగళహారతి తరువాత అర్చకులు ఇచ్చిన పూలహారం, చీరను బాను ముష్తాక్ స్వీకరించారు. ఈ సమయంలో ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయి. చాముండేశ్వరి మాతను అతి దగ్గరగా వీక్షిస్తూ ప్రార్థన చేశారు.
ఈ నేల పరంపర సర్వజన శాంతి తోట అని, అందువల్ల అస్త్రాలు ద్వారా కాదు, అక్షరాల ద్వారా జీవితాన్ని గెలవాలని, ఎలాంటివారు అయినా ప్రేమతో జీవితాన్ని జయించవచ్చని బాను ముష్తాక్ అన్నారు. ప్రారంభోత్సవ వేదికపై జ్యోతి వెలిగించి 415వ మైసూరు దసరా ఉత్సవాలను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. మైసూరు దసరా అంటే పండుగ మాత్రమే కాదని, ఇది కన్నడనేల సంస్కృతి అని వర్ణించారు. ఉత్సవం కనుక అందరినీ ఒక్కచోటికి తీసుకెళ్లే వేదిక అన్నారు. దసరా శాంతి పండుగ అని, సౌహార్ధ మేళా అని మన అందరి చెవుల్లో ప్రతిధ్వనించాలని ఆమె పేర్కొన్నారు. ఇది సర్వజనాలకు శాంతి తోటగా తెలిపారు. మైసూరు మహారాజుల సంస్కృతి, వారు కన్నడనాడు కోసం చేసిన కృషి, వారి అంతరాంతరాలలో ఉన్న హృదయస్పందన ఈ మైసూరు దసరా అని కొనియాడారు. సంస్కృతి అంటే భిన్నత్వం ఏకత్వం కావడమని, వాటి సుగంధాలను మహారాజులు అయిన జయచామరాజేంద్ర ఒడెయార్ నమ్మి ముస్లింలను భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారని, ఇది మాకు చాలా గొప్ప విషయమని చరిత్రను ప్రస్తావించారు. ఇక దిగువన మైసూరు నగరంలో పలు వేదికలలో కళా సాంస్కృతి సంబరాలు మిన్నంటాయి. ప్యాలెస్ ముందు ప్రముఖంగా కళా ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా అన్నిచోట్లా భారీ బందోబస్తు నిర్వహించారు.
రాష్ట్రమంతటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. బెళగావి నగరంలో దుర్గా దౌడ్ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. చిన్నారిని దుర్గాదేవి అవతారంగా భావించి మహిళలు పూజలు చేశారు. చిక్కమగళూరులో దుర్గాదేవి విగ్రహాల ఊరేగింపు జరిపారు.
మైసూరు చాముండి కొండపై అమ్మవారి ఆలయంలో బాను ముష్తాక్
చాముండేశ్వరి ఆలయం వద్ద స్వాగత సంబరాలు
రచయిత్రి బాను ముష్తాక్‌చే మైసూరు దసరా ఉత్సవాలకు నాంది
చాముండేశ్వరి అమ్మవారికి
విశేష పూజలు
పాల్గొన్న సీఎం సిద్దు, మంత్రులు
మైసూరులో వేడుకల కోలాహలం
అస్త్రాలు కాదు, అక్షరాల
ద్వారా గెలవాలి: బాను ముష్తాక్
అమ్మ సన్నిధిలో ఆనంద భాష్పాలు
రాష్ట్రంలో సంబరాలు

శక్తిదేవతకు అక్షరాంజలి

శక్తిదేవతకు అక్షరాంజలి