
అభివృద్ధి పనులకు నేతల శ్రీకారం
రాయచూరు రూరల్ : నగరంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనం, రాంపుర చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. విద్యార్థులకు జ్ఞాన సముపార్జనకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. విద్య, ఆరోగ్య రంగంలో అభివృద్ధిని సాధించాలన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా తాగునీటి సౌకర్యం కోసం నూతన చెరువు నిర్మాణాలకు అవకాశం కల్పించారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్ బోసురాజు, శాసన సభ్యులు బసన గౌడ, ఎమ్మెల్సీలు శరణేగౌడ, వసంత్ కుమార్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామిలున్నారు.
చదువుపై శ్రద్ధ అవసరం
రాయచూరు రూరల్: చదువుకొనే సమయంలో విద్యార్థినులు ప్రేమ, పెళ్లిల జోలికి వెళ్లకుండా చదువుపైనే శ్రద్ధ పెట్టి విద్యాభ్యాసం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి వెల్లడించారు. నగరంలోని మహిళా కళాశాలలో విద్యార్థినులతో సంవాద కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు కుల పట్టింపు లేదన్నారు. మహిళలకు అన్యాయం జరిగినా తమకు న్యాయం కావాలని ముందుకు రాకపోవడానికి ఆర్థిక, సామాజిక ఇబ్బందులే కారణమన్నారు. వివిధ స్థాయిలో వచ్చిన ఫిర్యాదులకు జిల్లా స్థాయిలో జిల్లాధికారి, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి వాటిని పరిష్కరించాలన్నారు. శ్రీదేవి, ఈరమ్మ, గిరిజా, సంజయ్ పవార్, రాజేశ్వరి, మంజుల, నవీన్ కుమార్‌లున్నారు.
ప్రైవేటు బస్సు బీభత్సం
●ఒకరు మృతి, మరొకరికి గాయాలు
రాయదుర్గం టౌన్: అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఊరువాకిలి వద్ద మొళకాల్మూరు రోడ్డు మలుపులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలలయ్యాయి. గురువారం తెల్లవారు జామున 5 గంటలకు రోడ్డు దాటుతున్న ఇద్దరి మీదకు బెంగళూరు నుంచి రాయదుర్గానికి వస్తున్న ఎస్‌ఆర్‌జే ప్రైవేటు దూసుకెళ్లింది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన నాగరాజు (59), మారెమ్మగుడి ఏరియాకు చెందిన నాయకుల ఓబులేశు (60) తీవ్రంగా గాయడ్డారు. కాళ్లు నుజ్జయ్యాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స తరువాత మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాయకుల ఓబులేశు మృతి చెందగా, నాగరాజును కర్నూలుకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేటు బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణం అని, డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు ఓబులేశు కూలి పని చేసేవాడుజ భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
డ్యాం గేట్ల నిర్మాణ
పనుల పరిశీలన
హొసపేటె: తుంగభద్ర డ్యాం గేట్ల నిర్మాణ పనులను మునిరాబాద్ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ నాయక్ గురువారం సందర్శించి పరిశీలించారు. టీబీ డ్యాం ఎస్టేట్ ఆవరణలో చేపడుతున్న గేట్ల నిర్మాణ పనులను దగ్గర ఉండి పరిశీలించారు. ఇప్పటికే గేట్ల నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. తుంగభద్ర మండలి ఎస్‌ఈ నారాయణ్ నాయక్ మాట్లాడుతూ డ్యాంకు సంబంధించిన 32 గేట్లలో ఇప్పటికే 7 గేట్ల నిర్మాణ పనులను పూర్తిగా తయారు చేశారన్నారు. అదే విధంగా 6 గేట్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయని తెలిపారు. మిగతా 18 గేట్ల తయారీ పనులు కూడా శరవేగంగా చేపడుతామన్నారు. గేట్ల నిర్మాణ పనులను గదగ్, టీబీ డ్యాం ఎస్టేట్ ఆవరణల్లో చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్‌డీఓ జ్ఞానేశ్వర్, మండలి ఇంజినీర్లు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు నేతల శ్రీకారం

అభివృద్ధి పనులకు నేతల శ్రీకారం

అభివృద్ధి పనులకు నేతల శ్రీకారం