
విశ్వకర్మ జయంత్యుత్సవం
రాయచూరు రూరల్: నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో విశ్వకర్మ జయంత్యుత్సవాన్ని సమాజం సభ్యులు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం అన్ని వర్గాల సేవలకు ముందుంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్ బోసురాజు, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ, ఎమ్మెల్సీలు శరణే గౌడ, వసంత్ కుమార్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్ రామస్వామి, విశ్వకర్మ జిల్లా సంచాలకుడు బ్రహ్మ గణేష్, సమాజం నేతలు గురు, రాము, ప్రకాష్, మనోహర్, రవి, మారుతి, శరణు, సురేష్, వెంకటేష్, వీరేష్‌లున్నారు.
రిమ్స్‌లో వైద్య సేవలు
ప్రైవేటు పరం?
● పరిశుభ్రతను కాపాడలేని డీన్
● మౌనం దాల్చిన మంత్రి పాటిల్
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రైవేట్ పరం కానున్నాయా? అనే మీమాంస ప్రతి ఒక్కరి మదిలో నాటుకు పోయింది. పేరుకు మాత్రమే ప్రభుత్వాస్పత్రి, వైద్యులు అన్ని పరీక్షలను, మందులను, మాత్రలను బయటనే చేయించుకోవాలని చీటీలు రాసి పంపడాన్ని రోగులు, ప్రజలు ఖండిస్తున్నారు. వైద్యులు నగర వాసులు అధికంగా ఉండడంతో టీచింగ్‌తో పాటు వైద్య సేవలందిస్తున్నారు. వీరంతా ప్రైవేట్ నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు నడుపుకుంటూ రిమ్స్ రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులకు రావాలని సూచిస్తున్నారు. ఇదే ఆసరాగా భావించిన ఫార్మసిస్టులు మందుల షాపుల్లో రోగులు చీటీలు ఇచ్చినా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని బయట మందుల దుకాణాల్లో తీసుకోవాలని చెబుతున్నట్లు రోగులు వాపోతున్నారు. ఈ విషయంలో జిల్లా ఇంచార్జి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, ప్రజా ప్రతినిధులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. రోగులకు కేటాయించిన వార్డులు అసౌకర్యంగా ఉన్నాయి. వార్డులను శుభ్రం చేయకుండా మరుగుదొడ్ల గదుల్లో పాచిక పేరుకొని రోగులు కాలు జారి కిందపడితే అడిగే నాథుడు లేడు. రిమ్స్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.