
వృద్ధులకు క్రీడా పోటీలు
హుబ్లీ: అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం నేపథ్యంలో ధార్వాడ ఆర్‌ఎన్ శెట్టి మైదానంలో సంబంధిత శాఖల ఆధ్వర్యంలో వృద్ధులకు వివిధ క్రీడాల పోటీలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి న్యాయసేవ ప్రాధికార జిల్లా సభ్యత్వ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి పరశురామ్ దొడ్డమనె మాట్లాడారు. పార్లమెంట్‌లో వృద్ధుల సంక్షేమం, అభ్యున్నతి కోసం 2007లో చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ చట్టంపై ప్రతి వృద్ధులు అవగాహన పెంచుకొని తమ న్యాయసేవా ప్రాధికారను సంప్రదించాలని కోరారు. ఏ తల్లిదండ్రికై నా తమ సంతానం వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగినా తక్షణమే పోలీసుల సహాయంతో ప్రభుత్వ పని వేళల్లో పాత కోర్టు ఆవరణలోని తమ న్యాయసేవా ప్రాధికార కార్యాలయాన్ని సంప్రదించి తగిన న్యాయం పొందవచ్చన్నారు. ఎవరూ కూడా భయపడాల్సి పని లేదన్నారు. తమ కొడుకు, కూతుళ్లపై వ్యామోహంతో ఏ అవ్వా, తాత కూడా ఇబ్బందులు పడరాదన్నారు. వృద్దులకు వివిధ ఆటలు, ఏకాపాత్రాభినయం, గాయనం, భజన తదితర పోటీలను నిర్వహించారు. గెలిచిన వారికి అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమ వేదికపై బహుమతులను ప్రదానం చేస్తారని ఆమె అన్నారు. బుద్ధిమాంద్యుల పాఠశాల సీనియర్ ఉద్యోగి అన్నప్ప కోళి, వివేకానంద వృద్దాశ్రమం సూపరింటెండెంట్ రుద్రయ్య చరంతి మఠ, మైత్రి ఆశ్రమం కలాం, శారద ఆశ్రమ నిర్వాహకులు, అవ్వతాతలతో పాటు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

వృద్ధులకు క్రీడా పోటీలు