
మళ్లీ పుర్రెల గోల
బనశంకరి: ధర్మస్థలలో మృతదేహాల కోసం వేట ఎంతకీ తెగడం లేదు. బంగ్ల గుడ్డె అనే అటవీ ప్రాంతంలో శవాలను పూడ్చిపెట్టారని విఠల్‌గౌడ అనే నిందితుని సమాచారం మేరకు తవ్వకాలను తీవ్రతరం చేశారు. గురువారం జరిపిన తవ్వకాలలో 7 మనిషి పుర్రెలు, 113 ఎముకలు దొరికినట్లు సమాచారం, వాటిని ప్లాస్టిక్ కవర్లలో భద్రపరచి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. బంగ్ల గుడ్డలో అనేక అస్థిపంజరాలను చూశానని, దుష్ప్రచారం కేసులో అరెస్టయిన నిందితుడు విఠల్‌గౌడ చెప్పిన మేరకు సిట్ బుధవారం నుంచి మరోదఫా తవ్వకాలను ప్రారంభించడం తెలిసిందే. ఓ అస్థిపంజరం పక్కనే సీనియర్ సిటిజన్ కార్డు లభ్యమైంది. చెట్టులో రెండు తాళ్లు, ఒక చీర దొరికాయి, దీంతో ఉరివేసుకుని ఉంటారనే అనుమానం వ్యక్తమైంది. అన్ని వస్తువులను క్లూస్ టీం సిబ్బంది భద్రంగా సీల్ చేశారు. సిట్ ఉన్నతాధికారి జితేంద్ర దయామ నేతృత్వంలో సుమారు 7 గంటలపాటు స్థల పరిశీలన సాగింది. అటవీ, ప్రజాపనులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 13 ఎకరాల విస్తీర్ణం కలిగిన బంగ్లగుడ్డలో 5 చోట్ల పరిశీలన చేశారు. అస్థిపంజరాలు దొరకడంతో మళ్లీ కలకలం మొదలైంది.
కోర్టులో చిన్నయ్య హాజరు
పుర్రెను ఎక్కడి నుంచి తెచ్చాడనే కేసులో మా స్క్‌మ్యాన్ చిన్నయ్యను గురువారం బెళ్తంగడి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి ముందు చిన్నయ్య మరింత సమాచారం ఇవ్వగా గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి జత చేశారు. ఈ నెల 6 నుంచి అతనిని శివమొగ్గ జైలులో ఉంచారు. కోర్టు వాయిదా తరువాత మళ్లీ తరలించారు.
ధర్మస్థల వద్ద బంగ్ల గుడ్డె తవ్వకాలు
7 పుర్రెలు, వందకు పైగా ఎముకలు లభ్యం
అక్కడే చీర, తాళ్లు, ఐడీ కార్డు
సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలింపు
ధర్మస్థల ఫైల్స్‌లో మరో మిస్టరీ
తిమరోడి ఇంటిలో తుపాకీ
యశవంతపుర: ధర్మస్థలలో దుష్ప్రచారం కేసులో నిందితుడు మహేశ్‌శెట్టి తిమరోడి ఇంటిలో పిస్టల్, కత్తులు లభించాయి. దీంతో అతనిపై అక్రమ ఆయుధాల కేసును స్థానిక పోలీసులు నమోదు చేశారు. ఉజిరె గ్రామంలో తిమరోడి ఇంటిలోనే ముసుగుమనిషి చిన్నయ్య బస చేసేవాడు. దీంతో అతని ఇంటిలో పోలీసులు రెండో దఫా తనిఖీలుచేయగా ఫిస్టల్, కత్తులు వంటి ఆయుధాలు లభించాయి. వాటిని సీజ్ చేశారు.

మళ్లీ పుర్రెల గోల