
జోరు వాన.. కూలిన చెట్లు
బనశంకరి: సిలికాన్ సిటీలో మరోసారి వరుణుడు విజృంభించాడు. బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. లాల్‌బాగ్ రోడ్డు, కార్పొరేషన్, టౌన్‌హాల్, జయనగర, శాంతినగర డబుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయి వాహన సంచారానికి ఆటంకమైంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వర్షం గురువారం తెల్లవారుజాము వరకు జల్లులతో కొనసాగింది.
నీటి మడుగుల్లా రోడ్లు
లాల్‌బాగ్ రోడ్డులో అడ్డంగా చెట్టు కూలిపోయింది, కొమ్మలు వైర్లకు తగిలి కరెంటు స్తంభం కూడా విరిగింది. హుణసేమారనహళ్లిలో విమానాశ్రయానికి వెళ్లే రోడ్డు , మైసూరు రోడ్డు, పశ్చిమ కార్డ్ రోడ్డు, జేసీ రోడ్డు, బళ్లారి రోడ్లలో చెరువుల్లా మారి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఓ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై కరెంటు పోల్ పడిపోయినా, బెస్కాం అధికారులు విద్యుత్ సరఫరాను కట్ చేయలేదు. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణహాని కలగలేదు.
మరో 2 రోజులు ఇంతే
బసవేశ్వరనగరలో 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విద్యాపీఠలో 3 సె.మీ, రాజాజీనగర, పట్టాభిరామనగర, హంపినగర, జక్కూరు, రాజమహల్‌గుట్టహళ్లిలో తలా 2.5 సెంటీమీటర్లు చొప్పున అనేక ప్రాంతాలలో భారీ వర్షమే కురిసింది. బెంగళూరుతో పాటు పరిసర ప్రదేశాల్లో రానున్న 2 రోజులు మేఘావృతమై, సాధారణ లేదా పిడుగులతో కూడిన వర్షం కురుస్తుంది. రాజధానిలో గురువారం సాయంత్రం మళ్లీ వర్షం కకావిలకం చేసింది. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో, ఔటర్ రింగ్ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. లోతట్టు ప్రదేశాల్లో నీరు చేరింది.
సిలికాన్ సిటీలో రాత్రంతా వర్షం
తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు

జోరు వాన.. కూలిన చెట్లు

జోరు వాన.. కూలిన చెట్లు