
కులగణన చిక్కుముడి
బనశంకరి: ముందు గొయ్యి, వెనుక గొయ్యి మాదిరిగా కులగణన విషయంలో సిద్దరామయ్య సర్కారు పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ఓసారి సర్వేని నిర్వహించి విమర్శల పాలైంది. మళ్లీ త్వరలో కొత్తగా కులగణన చేపట్టబోతోంది. ఈ తలనొప్పి ఎందుకని అనేకమంది మంత్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం కులగణన పట్ల కొందరు మంత్రుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. గురువారం సీఎం సిద్దరామయ్య, మంత్రి హెచ్‌కే.పాటిల్ నేతృత్వంలో మంత్రుల భేటీ జరిగింది. కులగణనలోకి కొత్తగా 331 కులాలను చేర్చడం పట్ల కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా రాకూడదని గట్టిగా కోరారు. కొత్తకులాలు చేర్చడంతో గందరగోళం ఏర్పడుతుంది, దీనిని సరిదిద్దాలని కొందరు చెప్పగా, అసలు కులగణన అనేదే వద్దని మరికొందరు డిమాండ్ చేశారు.
వాయిదా వేయాలి: డీసీఎం
సామాజిక విద్యా సమీక్ష అంటే ఏమిటో ప్రజలకు వివరించడం సాధ్యమా అని ప్రశ్నించారు. కులగణన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తో పాటు 20 మందికి పైగా మంత్రులు అభిప్రాయపడ్డారు. ఐదారు మంది మంత్రులు మాత్రమే కులగణనకు మద్దతుగా నిలిస్తే, కొందరు మంత్రులు తటస్థంగా ఉన్నారు. మంత్రులు చెప్పిన విషయాలను ఆలకించిన సీఎం సిద్దరామయ్య కులగణన చేసినా, చేయకపోయినా వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. కులగణన చేపడితే ఉన్నత వర్గాల వ్యతిరేకి అంటారని పేర్కొన్నారు. మళ్లీ ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించాలని కొందరు సూచించారు. అప్పుడు వచ్చే అభిప్రాయాలను బట్టి సిద్దరామయ్య అంతిమ నిర్ణయం తీసుకుంటారు.
ఎక్కువమంది మంత్రుల అభ్యంతరం

కులగణన చిక్కుముడి