
బాలున్ని మింగిన ఫారంపాండ్
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకా గొళ్లుచిన్నప్పనహళ్లి కి చెందిన అజయ్, చైత్ర అనే కూలీ దంపతుల ఏకై క కుమారుడు కిశోర్ (4) బుధవారం సాయంత్రం ఆటలాడుతూ ఫారంపాండ్‌లో పడి చనిపోయాడు. వివరాలు.. మంజునాథ్ అనే రైతు ఇంటి పక్కనే ఫారంపాండ్‌ను కట్టుకుని ఆ నీటిని వాడుకునేవాడు. గ్రామస్తులు మాట్లాడుతూ ఆ గుంత చుట్టూ గోడ లేదా ముళ్ల కంచె వేయాలని అనేకసార్లు చెప్పినా మంజునాథ్ పట్టించుకోలేదు. పిల్లవాడు ఆడుకుంటూ అందులోకి పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండడంతో కొంతసేపటికే కన్నుమూశాడు. తల్లి చైత్ర చిన్నారి శవాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. గుంత చుట్టూ కంచే వేయండి అని ఎన్నోసార్లు చెప్పినా లెక్కచేయలేదు. ఇలా మా బిడ్డ పోయాడు, ఇంతకుముందు ఒకసారి అదే గుంతలో పడ్డాడు, అప్పుడు నీళ్లు లేనందున, ఓ కుక్క మొరగడంతో జాగ్రత్త పడి బయటకు తీసుకువచ్చాం. ఇప్పుడు ప్రాణాలు పోయాయి అని రోదించింది. చిక్కబళ్లాపురం రూరల్ ఎస్‌ఐ శరణప్ప ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.
చిక్క తాలూకాలో విషాదం