
రక్తదానం ప్రధానం
మైసూరు: మైసూరులోని ఉద్దూరు గేట్ వద్ద ఉన్న డాక్టర్ విష్ణువర్ధన్ స్మారకంలో జీవధార రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ విష్ణువర్ధన్ 75వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 75 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. విష్ణువర్ధన్ అల్లుడు, నటుడు అనిరుధ్ మాట్లాడుతూ రక్తానికి కులమతాలు లేవని, అందరూ రక్తదానం చేయాలని సూచించారు. అప్పాజీ సాహస సింహ (విష్ణువర్ధన్)కి కర్ణాటక రత్న అవార్డు అభిమానుల ఆశీర్వాదంతోనే లభించిందన్నారు.
అమృత్‌పాల్‌కు చుక్కెదురు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సంచలనం కలిగించిన 545 ఎస్‌ఐ పోస్టుల కుంభకోణంలో నిందితుడు, అదనపు డీజీపీ అమృత్‌పాల్ పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. తనపై దాఖలైన ఆ కేసును కొట్టివేయాలని ఆయన ఇటీవల పిటిషన్ వేశారు. అమృత్‌పాల్ ఎస్సై నియామకాలకు బాధ్యునిగా ఉండేవారు, ప్రశ్నాపత్రాల బీరువా తాళాలు ఆయన వద్దే ఉండేవి, తాళాలను ఆయన దుర్వినియోగం చేసినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో డబ్బు రూపంలో తీసుకున్న లంచాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల ఈ కేసును కొట్టివేయడం సమంజసం కాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు అమృత్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో జైలుపాలైన అమృత్‌పాల్ కొన్నాళ్ల తరువాత బెయిలుపై బయటకు వచ్చారు.
మృతుని ఖాతా నుంచి రూ.7.5 లక్షలు డ్రా
మైసూరు: బతికి ఉన్నా, చనిపోయినా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. అందరి డబ్బులను దోచేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఖాతాలోని సొమ్ము మాయం కావడంతో మృతుని భార్య సెన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన గణేష్ జూన్ నెలలో అంతుతెలియని సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల భార్య కృపా భర్త ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, జూన్ 27 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు రూ.7.5 లక్షల నగదు ఏటీఎం నుంచి విత్ డ్రా అయిందని, యూపీఐ ద్వారా బదిలీ అయినట్లు తేలింది. గణేష్ మరణం తరువాత ఏటీఎం కార్డు పోలీసుల వద్ద ఉందని భార్య అనుకున్నారు. కానీ డబ్బు మాత్రం పోతూనే ఉంది. ఈ స్కాంపై ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యథేచ్ఛగా చెరువు కబ్జా
శివమొగ్గ: శివమొగ్గ తాలూకాలోని గెజ్జేనహళ్లి గ్రామ శివార్లలోని కెంగలకెరె చెరువు స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. జేసీబీల ద్వారా చెరువు గట్టు తెంచి స్థలం కబ్జా చేస్తున్నారని, కోటెగంగూరు గ్రామ పంచాయతీ అధికారులతో పాటు పలు శాఖలకు తెలిపినా ఎలాంటి ప్రయోజనం కలగలేదని వాపోయారు. సదరు చెరువు ప్రజలకు, పశువులకు ఎంతో అనుకూలంగా ఉందని, కబ్జాకు గురైతే గ్రామానికి నష్టమని చెప్పారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని చెరువు స్థలం రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళనలు తప్పవని గ్రామపెద్ద టీకానాయక్ తెలిపారు.
మైసూరు దసరాపై
సుప్రీంలో అర్జీ
యశవంతపుర: మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ అతిథిగా ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు ప్రతాప్ సింహ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేయడం తెలిసిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాను ముష్తాక్‌ను ఆహ్వానించడం సరికాదని పిటిషన్ సమర్పించగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ధర్మాసనం విచారించింది. దసరా ఉత్సవాల ప్రారంభానికి కొన్నిరోజులే ఉన్నందున పిటిషన్‌ను త్వరగా విచారించాలని ప్రతాపసింహ న్యాయవాది మనవి చేశారు. దసరా ఉత్సవాలను హిందుయేతర వ్యక్తులు ప్రారంభించడం సరికాదని న్యాయవాది అన్నారు. విచారణను 19కి వాయిదా వేశారు.

రక్తదానం ప్రధానం