
బ్యాంకులు.. దోపిడీ దొంగల లక్ష్యాలు
గత కొన్నినెలల్లో జరిగిన బడా దోపిడీలు
హుబ్లీ: దోపిడీ దొంగలకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. కన్నేశారో.. ఆ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ లూటీ కావాల్సిందే. కొన్ని నెలల విరామంతో క్రమం తప్పకుండా జరుగుతున్న బ్యాంకుల దోపిడీలు అటు ప్రభుత్వంతో పాటు ఇటు సామాన్య ప్రజలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నేర కథల సినిమాల ప్రభావం, ఆకర్షణీయంగా మారిన బంగారం ధరలు.. దోపిడీదారులను ప్రేరేపిస్తున్నాయి.
చంపేస్తామని బెదిరిస్తూ..
తాజాగా విజయపుర జిల్లా చడచన పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో దోపిడీ పోలీసులను ఉలికిపాటుకు గురిచేసింది. మంగళవారం సాయంకాలం 6.20 గంటల ప్రాంతంలో ఐదారుమంది వ్యక్తులు ఆర్మీ జవాన్ల మాదిరిగా దుస్తుల్లో వచ్చారు. నల్ల మాస్కు, తెల్ల టోపీ, కళ్లద్దాలు ధరించారు, బ్యాంక్ మేనేజర్‌కి ఓ ఫారం ఇచ్చి ఖాతా తెరుస్తామన్నారు. ఫారం నింపలేదని, రాసుకొని రమ్మని మేనేజర్ చెప్పాడు, ఆ తర్వాత బ్యాంక్ క్యాష్ ఇన్‌చార్జి మహంతేష్‌తో కలిసి డబ్బు, బంగారాన్ని భద్రం చేసే స్ట్రాంగ్ రూం దగ్గరకు వెళ్లామని మేనేజర్ చెబుతున్నాడు. అదే సమయంలో మాస్క్ వ్యక్తి పిస్టల్ పట్టుకుని హిందీలో మేనేజర్ వద్దకొచ్చాడు,.. క్యాష్ నిక్కాలో, వర్ణ జాన్సే మార్దుంగా అని బెదిరించాడు. మిగతా దుండగులు సిబ్బందిని అలాగే హెచ్చరించి టాయ్‌లెట్లో బంధించారు. తుపాకులతో బెదిరిస్తూ బీరువాలు, లాకర్లను తెరిపించారని మేనేజర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దిగులుగా ఉంది: ఖాతాదారు
బంగారం కుదువపెట్టిన ఖాతాదారుల్లో ముఖ్యంగా హులజంతి గ్రామస్తులు ఎక్కువమంది ఉన్నారు. రాత్రి దోపిడీ గురించి తెలియగానే బ్యాంక్‌కు వందలాదిగా వచ్చారు. 40 గ్రాముల బంగారును కుదువపెట్టి రూ.2.50 లక్షలు లోన్ తీసుకున్నానని, చాలా దిగులుగా ఉందని సంగమేష్ అనే రైతు మీడియా ఎదుట వాపోయారు. ఒక తులం నుంచి పావు కేజీ వరకు ఇక్కడ కుదువ పెట్టి రుణాలు తీసుకున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ
రూ. కోటికి పైగా నగదు, 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాలలో దర్యాప్తును చేపట్టినట్లు జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబర్గి మీడియాకు తెలిపారు. దుండగులు తమ కారును నిలిపిన చోటు నుంచి బ్యాంకు లోపలి వరకు వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం పోలీసులు జాగిలాలతో వెతికారు. జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలో గాలింపు చేపట్టారు.
భారీగా బంగారం, డబ్బు లూటీ
విజయపుర జిల్లాలో మరో బ్యాంకు ఖాళీ
దొంగల స్వైరవిహారంతో కలవరం

బ్యాంకులు.. దోపిడీ దొంగల లక్ష్యాలు

బ్యాంకులు.. దోపిడీ దొంగల లక్ష్యాలు