
విశ్వకర్మ సిద్ధాంతాలు అనుసరణీయం
బళ్లారి రూరల్ : విశ్వకర్మ సత్యాన్ని, ధర్మాన్ని ప్రజలందరూ ఆచరించాలని బళ్లారి ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. బుధవారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విశ్వకర్మ గ్రంథాలను, ఆయన జీవనశైలిని, తత్వాలను అనుసరించాలన్నారు. రాజ్యాంగం మనకు విద్యను ఆర్జించే హక్కును కల్పించింది. దీన్ని ప్రతిఒక్కరూ ఉపయోగించుకొని ఉత్తమ విద్యను అభ్యసించి ప్రతిభావంతులు కావాలన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు. గురువులు జ్ఞానాన్ని ప్రసాదించి భవిష్యత్తును అందిస్తారన్నారు. జిల్లాసుపత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఎంఆర్‌ఐ స్కానింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో జవహర్ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ.చిదానందప్ప విశ్వకర్మ సిద్ధాంతాలను, తత్వాలను విశదపరిచారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ వృషభేంద్రాచార్య, మేయర్ ముల్లంగి నందీశ్, విశ్వకర్మ అభివృద్ధి నిగమ సభ్యుడు చంద్రశేఖర్, కన్నడ సంస్కృతి శాఖ సంచాలకుడు బి.నాగరాజు, విశ్వకర్మ వికాస వేదిక అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద
కారకుడికి జైలు శిక్ష
హుబ్లీ: పాదచారిని ఢీకొని ఆ గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించకుండా అతడి చావుకు కారకుడయ్యారన్న కారణంతో సదరు ఆరోపణలు రుజువైన నేపథ్యంలో ఓ వ్యక్తికి ప్రధాన సెషన్స్ కోర్టు, జేఎంఎఫ్‌సీ ఫస్ట్ గ్రేడ్ న్యాయమూర్తి రూ.4 వేల జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వివరాలు.. సతీష్ సంబ్రాణి శిక్షకు గురైన వ్యక్తి. 2022 డిసెంబర్ 18న గదగ్ రోడ్డులో వేగంగా బైక్ నడుపుతూ రోడ్డు దాటుతున్న లక్ష్మినారాయణను అనే వ్యక్తి ఢీకొన్నాడు. అంతేగాక మానవత్వాన్ని మరచి బైక్ నిలపకుండా పరారయ్యారు. ఘటనలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. 2022లో డిసెంబర్ 23న చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసును హుబ్లీ తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు దాఖలు చేసుకొని సీఐ శ్రీశైల గాబి చార్జిషీట్ సమర్పించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కరే హనుమంతప్పపై మేరకు తీర్పును వెల్లడించారని అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాది గంగాధర గౌడ ప్రభుత్వం తరపున వాదించినట్లుగా తెలిపారు.
విద్యుత్ షాక్ తగిలి బాలిక మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కక్కుప్పి గ్రామంలో వాటర్ హీటర్ నుంచి విద్యుత్ షాక్ తగిలి ఒక బాలిక మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని భాగ్యశ్రీ(15) కూడ్లిగి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు స్నానం చేసేందుకు నీటిని వేడి చేయడానికి వాటర్ హీటర్ వేసింది. ఆ సమయంలో నీటి హీటర్ నుంచి విద్యుదాఘాతం ఏర్పడటంతో బాలిక మరణించింది. ఘటనపై కూడ్లిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎమ్మెల్యే సందర్శన, పరామర్శ
కాగా ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌టి శ్రీనివాస్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి, మరణించిన బాలిక కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం కూడా అందించి, కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఆరోగ్యకర సమాజం నిర్మించాలి
హొసపేటె: జగద్గురు కొట్టూరు స్వామి సంస్థానమఠంలో నిరంజన్ జగద్గురు కొట్టూరు బసవలింగ మహాస్వామి సమక్షంలో 1173వ మాస శివానుభవ సంపద కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కొట్టూరు బసవలింగ మహాస్వామి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శివానుభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమానత్వ సమాజం, కయాక్ సమాజం, దాసోహ సమాజం అందరి అభిప్రాయాలను గౌరవించే సమాజం, ఆరోగ్యకరమైన సమాజం, ఆనందకరమైన సమాజం, ద్వేష రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. అనంతరం అంజుమాన్ ఖిద్మతే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎన్ మహమ్మద్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ భారతీయ సమాజంలో ప్రవక్త మహమ్మద్ ఆదర్శం, ఔచిత్యం, ప్రవక్త మహమ్మద్ గురించి తెలుసుకోవడం అనే పుస్తకాలను విడుదల చేశారు. రిటైర్డ్ లెక్చరర్ చంద్రశేఖర్ శాస్త్రి, జమాతే ఇస్లామీ–ఏ–హింద్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ ముల్లా సయ్యద్ నజుముద్దీన్, అంజుమన్ కమిటీ సభ్యులు ఎం.ఫైరోజ్ ఖాన్, డాక్టర్ దుర్వేష్ మొయిద్దీన్, వీరశైవ సమాజ సీనియర్ నాయకులు, ముస్లిం సమాజ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.
యువతి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మండలం మెచ్చిరి గ్రామంలో బుధవారం సాయంత్రం కర్ణాటకకు చెందిన ఆశ(17) ఆత్మహత్య చేసుకుంది. సరిహద్దు కర్ణాటకలోని మొళకాల్మూరు తాలూకా బొమ్మలింగనహళ్లి గ్రామానికి చెందిన మల్లికార్జున, నిర్మల దంపతుల కుమార్తె ఆశ మొళకాల్మూరులో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతోంది. నాలుగు రోజుల క్రితం మెచ్చిరి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి మేనమామ ఇంట్లో ఉంటోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆశ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విశ్వకర్మ సిద్ధాంతాలు అనుసరణీయం

విశ్వకర్మ సిద్ధాంతాలు అనుసరణీయం