బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ప్రఖ్యాత బన్నేరుఘట్ట జూ పార్క్‌లోని ఓ ఎలుగుబంటికి కృత్రిమ కాలుని అమర్చారు. ఇక్కడి ఎలుగుబంటి సంరక్షణ కేంద్రంలో వహికరన్ అనే పేరుతో ఓ ఎలుగుబంటి ఉంది. ఇది బళ్లారి జిల్లాలో అడవుల్లో 2019లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది, దాంతో ఎడమవైపు వెనుక కాలు కొంత మేర తెగిపోయింది. అక్కడి అటవీ సిబ్బంది దానిని కాపాడి బన్నేరుఘట్ట జూ కి తరలించారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటోంది. కాలు కట్ అయినందున నడవడానికి కష్టపడుతోంది. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన ప్రముఖ జంతు సర్జన్ డెరిక్ కంపనా వచ్చి ఈ ఎలుగును పరిశీలించారు. దేకుతూ వెళ్లడం, చెట్లు, బండరాళ్ల ఎక్కలేకపోవడంతో ఏదైనా చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు శస్త్రచికిత్స చేసి కృత్రిమ కాలుని అమర్చినట్లు జూ అధికారులు తెలిపారు. ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తోందని చెప్పారు.
బన్నేరుఘట్ట జూలో ఆపరేషన్
భల్లూకానికి కొత్త కాలు