బళ్లారి రూరల్ : ఎట్టకేలకు సిటీ బస్టాండు ఆవరణలో ఉన్న కార్యాలయాలకు, కేఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది వెళ్లడానికి కాలి బాట దారి ఏర్పాటు చేశారు. నగరంలోని సిటీబస్టాండు ముందు ఓపెన్ డ్రైనేజీ పనుల్లో భాగంగా చేపట్టడంతో బస్టాండు ఆవరణలో ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది కార్యాలయం, ఎల్‌ఐసీ, కెనరా, యూనియన్ బ్యాంకు, సిటీ ఆసుపత్రులకు వెళ్లే దారి మూసివేశారు. ఈ విషయంపై బుధవారం సాక్షి దినపత్రికలో వార్తాకధనం వెలువడింది. దీంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ కార్యాలయాలకు వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు.
పంటనష్టం పరిశీలన
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు, వంతెనలు నీటితో నిండి పొంగి ప్రవహించాయి. కలబుర్గి జిల్లాలో పెసలు నీటి పాలయ్యాయి. చిత్తాపుర తాలూకాలో భీమా నది పొంగి ప్రవహించడంతో రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లోకి నీరు చొరబడ్డాయి. బీదర్ జిల్లా భాల్కి తాలూకాలో ఆనందవాడి, కారంజ మధ్య వంతెన వరద నీటిలో మునిగింది. 16 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం యువ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమార స్వామి, మాజీ మంత్రి బండెప్ప కాశంపురలు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను ఆలకించారు. సేడం తాలూకాలో వానలకు పాడైన పంటలను పరిశీలించారు. పంట నష్ట పరిహారం కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి సిద్దరామయ్య రూ.950 కోట్లు కేటాయించారన్నారు.
పంట నష్టం పరిశీలించిన సీఎం
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలబుర్గి జిల్లాలో పెసలు, కంది పంటలు నీటి పాలయ్యాయి. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కల్యాణ కర్ణాటక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలను ఆలకించారు. కలబుర్గి జిల్లా చించోళి, అఫ్జల్‌పుర, పర్హతాబాద్‌లో వానలకు పాడైన పంటలను పరిశీలించారు. పంట నష్ట పరిహారం త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్ట పరిహారం అందజేతకు రూ.950 కోట్లు కే టాయించామని సీఎం అన్నారు. ఈసందర్భంగా మంత్రి ప్రియాంక ఖర్గే, జిల్లాధికారిణి ఫౌజియా తరన్నుమ్‌లున్నారు.
పౌష్టికాహారం అవసరం
రాయచూరు రూరల్: ప్రతి మనిషి సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని కలబుర్గి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దయానంద అగసర్ పిలుపునిచ్చారు. బుధవారం కలబుర్గి వీరమ్మ గంగసిరి మహిళా కళాశాలలో జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్యాణరావ్, అరుణ, సుశీల్ కుమార్, రేఖా, ప్రేమ చంద్, ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా, మహేష్ గంగ్వార్‌లున్నారు.
ఫోన్ విక్రయిస్తున్నట్లు ఆశపెట్టి రూ.లక్షల్లో వంచన
హుబ్లీ: ఫేస్‌బుక్ పేజీలో వాణిజ్య ప్రకటన చూసి పాత స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ప్రయత్నించిన మోహన్ శివానందకు ఢిల్లీకి చెందిన వ్యక్తి రూ.19.58 లక్షలను బదలాయించుకొని వంచించారు. ఢిల్లీ జేజే కమ్యూనికేషన్‌కు చెందిన మనీష్ జైన్ మొబైల్ షాప్ పేరుతో పాత స్మార్ట్ ఫోన్‌ను రూ.18,500లకు విక్రయించినట్లుగా ఫేస్‌బుక్‌లో వాణిజ్య ప్రకటన ఇచ్చారు. మోహన్ ఫోన్‌లో దాన్ని చూసి సంప్రదించగా అడ్వాన్స్ రూ.11,100 బదలాయించుకొని మొబైల్ చేతికి అందిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వాలని ఆ వంచకుడు నమ్మబలికాడు. తన వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి నగదు బదలాయించుకొని వంచించినట్లుగా బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బస్టాండులోని కార్యాలయాలకు దారి