
కల్యాణ కర్ణాటకకు రూ.5 వేల కోట్లు
రాయచూరు రూరల్: వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. బుధవారం కలబుర్గిలోని సర్దార్ వల్లబ్‌బాయి పటేల్ క్రీడా మైదానంలో కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశానికి ఆగస్టులో స్వాతంత్య్రం వస్తే కల్యాణ కర్ణాటకకు ఏడాది అనంతరం సెప్టెంబర్ 17వ తేదీ రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికిన రోజు అని అభివర్ణించారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తారన్నారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. శాసన సభ్యులు, జిల్లాధికారి, జెడ్పీ అధికారిణి, ఎస్పీలున్నారు.
క–కకు ప్రత్యేక అభివృద్ధి పథకం
కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేకంగా అభివృద్ధి పథకం అమలు చేస్తామని సీఎం తెలిపారు. కలబుర్గిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కలబుర్గి స్మార్ట్‌సిటీ కోసం రూ.1685 కోట్లు కేటాయించామన్నారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణలో అనుభవ మంటపం, రాయచూరులో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు, కలబుర్గిని ప్రాంతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కలబుర్గిలో రూ.50 కోట్లతో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు, రాయచూరు, బళ్లారి జిలాల్లో మానవ తల్లి పాల కేంద్రాల ప్రారంభం, కొప్పళ జిల్లా అంజనాద్రి కొండ అభివృద్ధికి రూ.100 కోట్లు, ఏడు జిల్లాల్లో 18 నూతన తాలూకాల్లో భవనాల నిర్మాణాలకు రూ.130 కోట్లు కేటాయించామన్నారు. రాయచూరులో ప్రైవేట్ భాగస్వామ్యంతో స్పిన్నింగ్ మిల్లు ప్రారంభిస్తామన్నారు. రాయచూరులో రూ.40 కోట్లతో, యలబుర్గ, బళ్లారితో పా టు మరో ఐదు చోట్ల రూ.50 కోట్లతో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయిస్తాం అన్నారు. రాయచూరులో ప్రత్యేకంగా రూ.25 కోట్లతో మిరప మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికిన రోజు
విమోచన వేడుకలో సీఎం సిద్దరామయ్య