
మచ్చలేని నేత ప్రధాని మోదీ
సాక్షి,బళ్లారి: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి కాదు, శక్తి అని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల్లో పాల్గొనడంతో పాటు ఆయన కూడా రక్తదానం చేసిన అనంతరం మాట్లాడారు. మోదీ భారతదేశానికే నాయకుడు కాదు, యావత్ ప్రపంచం మెప్పు పొందేలా ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గుజరాత్‌కు విశేష సేవలు అందించారన్నారు. అనంతరం హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మోదీ పని చేస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నారన్నారు. దేశాభివృద్ధి, దేశ భద్రత విషయంలో రాజీ లేకుండా పని చేస్తున్నారన్నారు. మోదీ చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పనులు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మోదీ తనదైన ముద్రలో ఆయా రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధంలో ఘన విజయం సాధించారన్నారు. కోవిడ్ కష్టకాలంలో దేశ ప్రజల ప్రాణాలే కాకుండా ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్ అందించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇలాంటి పుట్టిరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడన్నారు. మోదీ పుట్టిన రోజును రక్తదాన శిబిరంలో తాను కూడా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్, మోకా విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, నగర బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం
రాయచూరు రూరల్: నగరంలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుక జరిగింది. 75వ కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవం సందర్భంగా శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, మోదీ అభిమానులు కేక్‌ను కత్తిరించి వేడుకను ఆచరించారు. అనంతరం రక్తదానం, ఉచిత వైద్య పరీక్ష శిబిరాలను నిర్వహించారు.
నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి

మచ్చలేని నేత ప్రధాని మోదీ