
వాల్మీకుల అణచివేతకు సీఎం కుట్ర
బళ్లారిటౌన్: రాష్ట్రంలోని వాల్మీకులకు రిజర్వేషన్లు దక్కకుండా వాల్మీకులను అణిచి వేసే కుతంత్రాలను సీఎం సిద్దరామయ్య చేస్తున్నారని అఖిల కర్ణాటక వాల్మీకి నాయకుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం గాంధీనగర్‌లోని వాల్మీకి సమావేశం, విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తమ వాల్మీకి నాయకులు ఉన్నారన్నారు. తమ ఎస్టీ రిజర్వేషన్లకు కేటాయించిన రిజర్వేషన్లతోనే పదవులు అందుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచిదేనని, సీఎం సిద్దరామయ్య తమ వర్గీయులను గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరగనున్న కులగణన లెక్కింపులో తమ వర్గీయులంతా హిందూ ధర్మం అని రాయించి కులం కాలంలో వాల్మీకులని రాయాలన్నారు. సోనియా గాంధీతో మార్కులు కొట్టేసేందుకు సిద్దరామయ్య అన్ని వర్గాలలోను క్రిస్టియన్లు ఉన్నట్లు ప్రకటిస్తున్నారరు. మాజీ మంత్రి నాగేంద్రపై అవినీతికి పాల్పడినట్లు సిద్దరామయ్య కులకుట్ర చేశారన్నారు. ఇందులో ఆయన పాత్ర ఉందన్నారు. మొరార్జీ దేశాయి స్కూళ్లలో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్ ఉన్నా చాలా చోట్ల ఇంకా కొన్ని సీట్లు భర్తీ చేయకుండా మిగిల్చారన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లాధ్యక్షుడు ముదిమల్లయ్య, నేతలు జయరామ, రుద్రప్ప, జనార్ధన నాయక్, మల్లన్న, రుద్రేష్, కృష్ణ, బసవరాజు, కేశవ, రాజు పాల్గొన్నారు.