
ప్రత్యేక రక్తదాన శిబిరం
బళ్లారి అర్బన్: రక్తదానం అన్ని దానాల కన్నా శ్రేష్టమైంది. అన్నదానం ఆకలి బాధను తీరిస్తే రక్తదానం మరో మనిషికి పునర్జన్మనిస్తుంది. ఆరోగ్యవంతులు అప్పుడప్పుడు రక్తదానం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర అభిమాని బళగ ప్రముఖులు ఎంజీ కనక తెలిపారు. కూల్‌కూల్ కార్నర్ దగ్గర నాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఆరోగ్యవంతుడు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఎటువంటి దుష్పరిణామాలు కలగవు. ఇలాంటి అపోహలను వీడి అందరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి, అనారోగ్యంతో బాధపడే వారిని ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేయగా, వారికి హెల్మెట్లను పంపిణీ చేశారు. సంగనకల్లు బాషాతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి నాగేంద్ర హితులు, ఆప్తులు, సన్నిహితులు పాల్గొన్నారు.