
మతమార్పిళ్లకు సర్కారు ప్రోత్సాహం
సాక్షి,బళ్లారి: సాధారణంగా చర్చి ఫాదర్లు, పలువురు క్రిస్టియన్లు హిందూవులను క్రిస్టియన్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటారని, దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్న తరుణంలో కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వమే హిందువులను క్రిస్టియన్లుగా మార్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని జిల్లా బీజేపీ శాఖ, సామాజిక న్యాయ జాగృతి వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన, ర్యాలీ, మానవహారం చేపట్టి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందుగా నగరంలోని కనక దుర్గమ్మ ఆలయం నుంచి అండర్ బ్రిడ్జి, రాయల్ సర్కిల్ మీదుగా జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ తీరుపై ఆందోళన చేపట్టారు. కమ్మరచేడు కళ్యాణ స్వామి, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి మాట్లాడుతూ క్రిస్టియన్ల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు పొందేందుకు పాలక పెద్దలు చేస్తున్న కుట్రలో భాగంగా ఈ తతంగం జరుగుతోందన్నారు. రెడ్డి సముదాయాన్ని దేవాంగ, బంజార, లింగాయత్, బ్రాహ్మణ, బలిజ, ఆది ఆంధ్రా, విశ్వకర్మ, ఆదిద్రావిడ తదితర 52 ఉప కులా వారి జాబితాతో పాటు ఉదాహరణకు బలిజ క్రిస్టియన్, మాల క్రిస్టియన్, బంజార క్రిస్టియన్ అంటూ నమోదు చేయించి, క్రిస్టియన్లుగా మార్చాలని, కుల గణతిని వాడుకుని వారి ఎత్తుగడలను విఫలం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మత మార్పిడి చెందితే వారి పుట్టిన పూర్వ కులం మారిపోతుందని గుర్తు చేశారు. కుల గణతిని చేపట్టే అధికారులకు ఇచ్చిన ఆదేశాలు, ఇళ్ల వద్దకు వచ్చి సర్వేలు చేసేటప్పుడు వారి కులాలను మార్చే కుట్రలు చేస్తున్నారని, దీనిని నిలుపుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఉద్దేశంగా జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఏకంగా హిందూమతానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే విధంగా యత్నిస్తోందన్నారు. క్రిస్టియన్ల జనాభాను పెంచేందుకు ఇదో రాజకీయ నీచమైన పని అని మండిపడ్డారు. మతమార్పిళ్లను ప్రభుత్వమే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహిస్తోందని, మతం మార్పిడి చేసుకోవడం వారి వారి హక్కు అని పదే పదే వ్యాఖ్యలు చేస్తుండడం వెనుక, కర్ణాటక సర్కార్ మతమార్పిళ్ల సర్కార్‌గా మారిపోయిందన్నారు. రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి మతమార్పిళ్లకు తెర దించాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా,రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కే.ఎస్ దివాకర్,కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, మల్లనగౌడ, బీజేపీ రైతు మోర్చా ప్రముఖులు ఐనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూవులను క్రిస్టియన్లుగా మార్చే కుట్ర చేస్తోంది
నగరంలో భారీ ర్యాలీ, మానవహారంతో ఆరోపణలు
సామాజిక న్యాయ జాగృతి వేదిక ఆధ్వర్యంలో నిరసన