
కుటుంబమే పవర్
సాక్షి, బెంగళూరు: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పదవులు అందుకోవడం, ప్రజాసేవ చేయడం అనేది సామాన్యులకు కష్టంగా మారుతోంది. ప్రస్తుతం నెపోటిజం.. అదే బంధుప్రీతి, కొన్ని కుటుంబాలే అధికారాన్ని శాసించడం అనేది రాజకీయాలతో పాటు అనేక రంగాల్లో సర్వసాధారణమై పోయింది. తాజాగా నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ సంక్షోభానికి నెపోటిజం కూడా ఒక కారణమని వార్తలు వస్తున్నాయి. తరతరాలుగా వారసత్వ రాజకీయాల నుంచి వస్తున్నవారు పవర్ పాటిలిక్స్‌ను నడిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లోనూ వారసత్వంగా పుట్టుకొచ్చిన నాయకులు ఉన్నారు. సీనియర్ నాయకులు, వారి వారసులే దశాబ్దాలుగా పదవులను పొందడం గమనార్హం.
● దేశంలో వారసత్వ ప్రజాప్రతినిధుల సంఖ్యలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. జాతీయ సగటు కంటే కూడా ఇది ఎక్కువ కావడం విశేషం.
● ఈ రంగంలో పేరుమోసిన తమిళనాడును కూడా కర్ణాటక దాటేసింది. తమిళనాడు కుటుంబ రాజకీయాల అంశంలో ఏడో స్థానంలో నిలిచింది.
● అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలెక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
● ఈ రెండు సంస్థలు విడుదల చేసిన నివేదికలో దేశంలో 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినట్లుగా తెలిసింది. అంటే దేశంలో ఉన్న మొత్తం ప్రజాప్రతినిధుల్లో 20 శాతం వారసులే ఉన్నారు. కర్ణాటక ఇది 29 శాతంగా నమోదైంది.
సామాన్యులకు రాజ్యాధికారం
క్లిష్టమైన లక్ష్యమే అవుతోంది
వారసత్వ రాజకీయాలకు
కేరాఫ్‌గా కర్ణాటక
94 మంది ప్రజాప్రతినిధులు ఆ వర్గమే
దేశంలోనే 4వ స్థానం
ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక
ఆ మూడు రాష్ట్రాల సరసన కన్నడనాడు
ఉత్తర ప్రదేశ్ కుటుంబ రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉంది. అక్కడ మొత్తం 141 మంది వారసత్వంగా వచ్చిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. మహారాష్ట్రలో 129 మంది, బిహార్‌లో 96 మంది కుటుంబ రాజకీయాల నుంచి ప్రవేశించారు. కన్నడనాడుది వీటి తరువాత స్థానమే కావడం బంధుప్రీతికి నిదర్శనం. కర్ణాటకలో 14 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఇలా మొత్తం 94 మంది కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. వీరిలో కూడా 85 మంది పురుషులు కాగా, 9 మంది మహిళలు ఉన్నారు. విద్యా, వైద్యం, ఐటీ, బీటీ వంటి అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కన్నడనాడులో కుటుంబ రాజకీయాలు శక్తివంతంగా తయారయ్యాయి.

కుటుంబమే పవర్

కుటుంబమే పవర్